పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం, నాదెండ్ల మండలం చిరుమామిళ్లలో కొత్తగా 30 పడకల ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (CHC) నిర్మాణానికి మార్గం సుగమమైంది. ఈ ఆస్పత్రి నిర్మాణానికి గోల్కొండ గ్రూప్ చైర్మన్ నడికట్టు రామిరెడ్డి పెద్ద మనసుతో రూ.5 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. మంత్రి సత్యకుమార్, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు కృషితో ఆస్పత్రి పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి.
ఇప్పటికే ఈ ఆస్పత్రి కోసం ఎకరన్నర భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. 2018లో ప్రతిపాదనలు సిద్ధమైనప్పటికీ, గతంలో పనులు నిలిచిపోయాయి. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్లీ ప్రాజెక్టు ముందుకు వచ్చింది. ఆస్పత్రి నిర్మాణానికి మొత్తం రూ.9.5 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఇందులో రూ.4.5 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తే, మిగిలిన రూ.5 కోట్లు రామిరెడ్డి విరాళంగా ఇస్తున్నారు. రామిరెడ్డి సత్కార్యాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు.
ఇదిలా ఉండగా, రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ స్థాయిలో ఆరోగ్య సదుపాయాలు విస్తరించడానికి ప్రభుత్వం రూ.217.10 కోట్లను విడుదల చేసింది. ఈ నిధులతో ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు (విలేజ్ హెల్త్ క్లినిక్‌లు) నిర్మించనున్నారు. మొత్తం 2,309 క్లినిక్‌లను ఉపాధి హామీ నిధులతో, మరో 696 క్లినిక్‌లను పీఎంఏబీహెచ్‌ఐఎం నిధులతో కట్టనున్నారు. ఒక్కో క్లినిక్‌పై సుమారు రూ.55 లక్షలు ఖర్చు చేసి, ప్రహరీ, తాగునీరు, విద్యుత్ వంటి అన్ని సదుపాయాలను కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యమని ప్రభుత్వం స్పష్టం చేసింది.