రైలు ప్రయాణికుల సంఖ్య నిరంతరం పెరుగుతున్న నేపథ్యంలో, ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ నార్త్ సెంట్రల్ రైల్వే ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాగ్ రాజ్, ఝాన్సీ, ఆగ్రా డివిజన్లలోని అన్ని ప్యాసింజర్ కోచ్లలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ చర్య ద్వారా ఆకతాయిల ఆగడాలు, దొంగతనాలు, చట్టవిరుద్ధ చర్యలను అరికట్టడమే కాకుండా, ప్రయాణికులు భద్రతతో ప్రయాణించేందుకు అవకాశం కలుగుతుంది.
ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా మొత్తం 1,782 కోచ్లలో సీసీటీవీ కెమెరాలు అమర్చనున్నారు. వీటిలో 895 లింకే హాఫ్మన్ బుష్ (LHB) కోచ్లు, 887 ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) కోచ్లు ఉంటాయి. ముఖ్యంగా ప్రయాగ్జ్ ఎక్స్ప్రెస్, శ్రమశక్తి ఎక్స్ప్రెస్ వంటి ప్రీమియం రైళ్లలో ఆధునిక AI ఆధారిత కెమెరాలను కూడా అమర్చాలని అధికారులు స్పష్టం చేశారు. దీని ద్వారా రైల్లో జరిగే అనుమానాస్పద కదలికలను ఆటోమేటిక్‌గా గుర్తించి రికార్డ్ చేసే అవకాశం ఉంటుంది.
మొదటి దశలో ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్, శ్రమశక్తి ఎక్స్ప్రెస్, కాళింది ఎక్స్ప్రెస్, అంబేద్కర్ నగర్ ఎక్స్ప్రెస్, లాలఘర్ ఎక్స్ప్రెస్, సంగమ్ ఎక్స్ప్రెస్, డెహ్రాడూన్ ఎక్స్ప్రెస్, మీరట్ సిటీ ఎక్స్ప్రెస్, శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా జమ్మూ మెయిల్ వంటి అనేక రైళ్లలో ఈ సీసీటీవీ వ్యవస్థను అమలు చేయనున్నారు. ఈ నిర్ణయం ప్రయాణికుల భద్రతలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తుందని అధికారులు భావిస్తున్నారు.
ప్రతి ఏసీ కోచ్‌లో నాలుగు కెమెరాలు అమర్చబడతాయి. జనరల్ కంపార్ట్మెంట్లు, స్లీపర్ కోచ్లు, ప్యాంట్రీ కార్లలో ఆరు కెమెరాలు ఏర్పాటు చేస్తారు. కెమెరాలను ప్రవేశ ద్వారాల వద్ద, కారిడార్లలో అమర్చడం ద్వారా కోచ్‌లోని ప్రతి కదలికను పర్యవేక్షించవచ్చు. ఈ వీడియోలు నేరుగా NCR ప్రధాన కార్యాలయం, అలాగే ఆగ్రా, ఝాన్సీ, ప్రయాగ్ డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయాలకు చేరతాయి. అదనంగా, లోకోమోటివ్ క్యాబిన్లలో కూడా నిఘా పరికరాలు అమర్చేందుకు ప్రణాళికలు కొనసాగుతున్నాయి.