ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు మరో కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. పన్నుల వసూళ్లలో పారదర్శకత తీసుకురావాలని భావించి ‘స్వర్ణ పంచాయతీ’ యాప్‌ను ప్రారంభించింది. ఈ నెల నుంచి రాష్ట్రంలోని అన్ని ఆర్థిక కార్యకలాపాలు ఈ సాఫ్ట్‌వేర్ ద్వారానే జరగనున్నాయి. ఇప్పటివరకు పన్నుల వసూళ్లు, లెక్కలు సరిగ్గా లేకపోవడం వల్ల అవినీతి జరుగుతుండేది. కానీ ఈ కొత్త యాప్ ద్వారా అన్ని లావాదేవీలు నేరుగా పంచాయతీ ఖాతాలో జమ అవుతాయి.

రాష్ట్రంలో 13,344 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఇళ్ల పన్నులు, నీటి పన్నులు ముందుగా సరిగ్గా వసూలు కాలేదని ప్రభుత్వం గుర్తించింది. ఇకపై యాప్ ద్వారానే డబ్బులు జమ కావడంతో అవినీతికి తావుండదని అధికారులు చెబుతున్నారు. డబ్బును గ్రామ అభివృద్ధి పనులకు మాత్రమే వినియోగిస్తారు. ఎంత ఖర్చు చేస్తున్నారో కూడా యాప్‌లోనే నమోదు చేస్తారు. దీంతో ఆదాయం, ఖర్చు వివరాలు అన్నీ పారదర్శకంగా ఉంటాయి.
ప్రజలు ఇంటి నుంచే పన్నులు చెల్లించవచ్చు. తమకు ఎంత బకాయి ఉందో, చెల్లించిన పన్ను ప్రభుత్వ ఖాతాకు చేరిందో క్షణాల్లో తెలుసుకోవచ్చు. ఈ విధానం వల్ల పంచాయతీల ఆదాయం పెరిగి, ప్రజల నమ్మకం కూడా పెరుగుతుందని అధికారులు అంటున్నారు.