బెంగళూరులో సైబర్ క్రైమ్ ఘటన మరోసారి ఆందోళన కలిగించింది. దేశంలోని అగ్రశ్రేణి ఐటీ సంస్థ ‘ఇన్ఫోసిస్’ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సతీమణి, రాజ్యసభ ఎంపీ సుధా మూర్తి మోసపూరిత కాల్ బారినపడ్డారు. ఆమె వ్యక్తిగత సమాచారాన్ని సేకరించేందుకు ఓ గుర్తుతెలియని వ్యక్తి యత్నించాడని, బెదిరింపులు చేశాడని సుధా మూర్తి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదులోని వివరాల ప్రకారం, ఇటీవల ఆమెకు ఓ అపరిచిత వ్యక్తి ఫోన్ చేశాడు. తనను కేంద్ర టెలికాం విభాగంలో ఉద్యోగినని పరిచయం చేసుకున్నాడు. ఆ వ్యక్తి, సుధా మూర్తి ఫోన్ నంబర్ ఆధార్ కార్డుతో అనుసంధానం కాలేదని పేర్కొంటూ, ఆమె వ్యక్తిగత వివరాలు అడిగాడు. అంతేకాకుండా, ఆమె నంబర్ నుంచి అభ్యంతరకర వీడియోలు వీక్షిస్తున్నారని, వాటిని ఇతరులకు ప్రసారం చేస్తున్నారని ఆరోపిస్తూ, వెంటనే వివరాలు చెప్పకపోతే ఫోన్ సేవలను నిలిపివేస్తామని బెదిరించాడు.
సుధా మూర్తి మాట్లాడుతూ, ఆ కాల్ చాలా దురుసుగా సాగిందని, తనపై మానసిక ఒత్తిడి తీసుకొచ్చే విధంగా మాట్లాడాడని పోలీసులకు తెలిపారు. వెంటనే అప్రమత్తమై, ఎటువంటి వివరాలు ఇవ్వకుండా, నేరుగా బెంగళూరు సైబర్ క్రైమ్ విభాగంలో ఫిర్యాదు చేశారు.
ప్రస్తుతం పోలీసులు ఆ కాల్ చేసిన వ్యక్తి ఫోన్ నంబర్‌ను ట్రేస్ చేస్తూ, అతడు ఏ నెట్‌వర్క్ ద్వారా కాల్ చేశాడన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు. ఇటువంటి కాల్స్ సాధారణంగా సైబర్ మోసగాళ్లు ప్రజలను మోసగించడానికి చేసే ప్రయత్నమేనని, ఎటువంటి పరిస్థితుల్లోనూ వ్యక్తిగత సమాచారం ఇవ్వకూడదని అధికారులు హెచ్చరిస్తున్నారు.
సుధా మూర్తి లాంటి ప్రముఖులు కూడా మోసగాళ్ల టార్గెట్ అవుతుండటం ప్రజలకు హెచ్చరిక వంటిదే. సైబర్ క్రైమ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో, ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండి, అనుమానాస్పద కాల్స్ లేదా మెసేజీలకు ప్రతిస్పందించకుండా నేరుగా పోలీసులకు సమాచారం ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. మొత్తం గా, ఈ ఘటన సైబర్ భద్రతపై మరింత అవగాహన కలిగి ఉండాల్సిన అవసరాన్ని మరోసారి గుర్తు చేసింది.