దసరా, దీపావళి నేపథ్యంలో ఆప్కో భారీ డిస్కౌంట్ ప్రకటించింది. పండగలను తెలుగుదనం ఉట్టిపట్టేలా జరుపుకోడానికి చేనేత వస్త్రాల కొనుగోలుపై 40 శాతం డిస్కౌంట్ అందజేయాలని నిర్ణయించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చేనేత పరిశ్రమ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది.
ఒకవైపు నేతన్నలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే మరో వైపు చేనేత వస్త్రాల అమ్మకాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందుకోసం రాష్ట్ర, జాతీయ స్థాయిలో చేనేత ఎగ్జిబిషన్లు నిర్వహిస్తోంది. అదే సమయంలో చేనేత దుస్తుల వినియోగంలో పెరిగేలా భారీ డిస్కౌంట్లు అందజేయడంతో పాటు ఈ కామర్స్ లో అమ్మకాలకు పెట్టింది.
నేరుగా వినియోగదారుల ఇళ్లకు చేనేత దుస్తులను డోర్ డెలివరీ చేస్తోంది. ఈ నేపథ్యంలో దసరా, దీపావళి పండగలను దృష్టిలో పెట్టుకుని చేనేత దుస్తుల కొనుగోలుపై 40 శాతం డిస్కౌంట్ అందజేయాలని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత ఆదేశాలతో ఆప్కో నిర్ణయించింది. రాష్ట్రంతో పాటు జాతీయ స్థాయిలో 92 ఆప్కో షో రూమ్ లున్నాయి.
ఈ షో రూమ్ ల్లో కొనుగోలు చేసే చేనేత వస్త్రాలపై 40 శాతం మేర భారీ డిస్కౌంట్ అందజేయనున్నారు. ఇంటిల్లపాది చేనేత దుస్తులు ధరించి, దసరా, దీపావళి పండగలు తెలుగింటి సంప్రదాయంలో ఘనంగా నిర్వహించుకోడానికి ఈ భారీ డిస్కౌంట్ దోహదపడడం ఖాయమని ప్రభుత్వం భావిస్తోంది.
డిస్కౌంట్ తో సంప్రదాయ రీతిలో పండగ చేస్కుందాం…
దసరా, దీపావళి పండగ నేపథ్యంలో ఆప్కో షో రూమ్ ల్లో చేనేత వస్త్రాల కొనుగోలుపై 40 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత వెల్లడించారు. ఈ మేరకు సోమవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు.
చేనేత వస్త్రాలపై 40 శాతం డిస్కౌంట్ తో వినియోదారులకు ఆర్థికంగా ఎంతో మేలు కలుగుతుందన్నారు. అదే సమయంలో చేనేత దుస్తుల అమ్మకంతో నేతన్నలకు కూడా ఆర్థిక భరోసా లభిస్తుందన్నారు. దసరా, దీపావళి పండగలను దృష్టిలో పెట్టుకుని వినియోగదారులు, చేనేతల కుటుంబాల్లో ఆనందాలు నింపడమే లక్ష్యంగా 40 శాతం డిస్కౌంట్ అందజేస్తున్నట్లు తెలిపారు.
చేనేత వస్త్రాలు తెలుగింటి సంప్రదాయానికి నిలువెత్తు ప్రతిబింబమన్నారు. ఇంటిల్లపాది చేనేత దుస్తులు ధరించి నేతన్నలకు అండగా నిలుద్దామని, దసరా, దీపావళి పండగలను సంతోషంగా జరుపుకుందామని మంత్రి సవిత ఆ ప్రకటనలో పిలుపునిచ్చారు.