రాష్ట్రంలో గిరిజనుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, 496 గ్రామాలను షెడ్యూల్డ్ ఏరియాలోకి చేర్చే ప్రతిపాదనలు సిద్ధం చేశామని గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. ఈ ప్రతిపాదనల ప్రకారం, 50 శాతం కంటే ఎక్కువ గిరిజన జనాభా కలిగిన గ్రామాలను గుర్తించి షెడ్యూల్డ్ పరిధిలోకి తీసుకురావాలని సంబంధిత ఐటీడీఏ పీవోలు, జిల్లా కలెక్టర్లకు ఇప్పటికే సూచనలు ఇచ్చినట్లు ఆమె వెల్లడించారు.
అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో బండారు సత్యనారాయణమూర్తి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ, అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గంలో 9 గ్రామ పంచాయతీలకు చెందిన 60 గ్రామాల్లో 25 వేలకు పైగా గిరిజనులు నివసిస్తున్నారని చెప్పారు. ఈ గ్రామాలను కూడా ప్రతిపాదనల్లో చేర్చినట్లు తెలిపారు.
ఇదిలా ఉంటే, బండారు మాట్లాడుతూ రాష్ట్రంలో 600కు పైగా గిరిజన గ్రామాలు ఇంకా నాన్ షెడ్యూల్డ్ పరిధిలో ఉన్నాయని, ఫలితంగా ఆ గ్రామాలకు తగిన అభివృద్ధి అవకాశాలు దక్కడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ, తన నియోజకవర్గంలోని 138 గిరిజన కాలనీలను షెడ్యూల్డ్ ఏరియాలోకి చేర్చాలని డిమాండ్ చేశారు. యానాదుల కార్పొరేషన్ ఏర్పాటు హామీని నెరవేర్చాలని కూడా కోరారు.
అలాగే, ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ కూడా తమ నియోజకవర్గంలోని 58 గ్రామాలను ఐటీడీఏ పరిధిలోకి తీసుకోవాలని అభ్యర్థించారు. ఈ క్రమంలో అసెంబ్లీలో ఇతర ప్రజాప్రతినిధులు కూడా గిరిజన గ్రామాల సమస్యలు, అభివృద్ధి లోపాలను ప్రస్తావించారు.
ఇక, ఇతర ప్రశ్నలకు సమాధానమిస్తూ మంత్రి గొట్టిపాటి రవికుమార్ రోడ్ల పక్కన విద్యుత్ లైన్లకు అడ్డుగా ఉన్న చెట్లను పూర్తిగా నరికి వేయడం లేదని, కేవలం కొమ్మలను మాత్రమే కత్తిరిస్తున్నామని తెలిపారు. అలాగే, ఇబ్రహీంపట్నం థర్మల్ పవర్ స్టేషన్ నుంచి వస్తున్న ఫ్లైయాష్ వల్ల కలిగే కాలుష్యంపై ప్రశ్నించగా, ఏపీ జెన్‌కో కాలుష్య నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టిందని చెప్పారు.