సూపర్ జీఎస్టీతో ప్రజలకు పెద్ద ఎత్తున మేలు జరుగుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. సూపర్ సిక్స్ పథకాలతో ప్రజలకు ఎలా మేలు జరిగిందో... సంస్కరణలతో కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని సూపర్ జీఎస్టీగా మార్చిందని.. దీని ద్వారా కూడా ప్రజలకు పెద్ద ఎత్తున లాభం జరుగుతుందని సీఎం వివరించారు.
సుమారు రూ.8,000 కోట్లు రాష్ట్ర ప్రజలకు ఆదా అవుతుందని చెప్పారు. సోమవారం జరిగిన మూడో రోజు అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జీఎస్టీ సంస్కరణలపై రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోయే ప్రచార కార్యక్రమాలపై శాసనసభలో ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ “జీఎస్టీ 2.0 ఫలాలు రాష్ట్ర ప్రజలందరికీ అందేలా మంత్రులతో కమిటీ ఏర్పాటు చేశాం.
పేదలు, మధ్యతరగతి ప్రజల జీవితాలను మార్చటమే లక్ష్యంగా జీఎస్టీ సంస్కరణలు తెచ్చారు. 2047 నాటికల్లా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యాల సాధనకు జీఎస్టీ సంస్కరణలు, సూపర్ సిక్స్ , పీ4 కార్యక్రమాలు శక్తివంతంగా పని చేస్తాయి. నిత్యావసర వస్తువుల్లో 99 శాతం వస్తువులపై సున్నా శాతం పన్ను ఉంది. చిన్న చిన్న వ్యాపారాలకు లబ్ది కలుగుతుంది.
ఎంఎస్ఎంఈలకు పెద్ద ఎత్తున జీఎస్టీ సంస్కరణల వల్ల ప్రయోజనం కలుగుతుంది. స్వదేశీ, మేక్ ఇన్ ఇండియా నినాదాలకు ప్రత్యక్షంగా నెక్స్ జెన్ జీఎస్టీ సంస్కరణలు పెద్ద ఎత్తున తోడ్పడతాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు పెద్ద ఎత్తున సహకారం లభిస్తుంది. గ్లోబల్ బ్రాండ్లుగా భారతీయ ఉత్పత్తులు పోటీ పడేందుకు పెద్ద ఎత్తున ఆస్కారం కలుగుతుంది.
భారతీయ ఉత్పత్తులు కొనుగోలు చేస్తే దేశాభివృద్ధిలో నేరుగా భాగస్వాములైనట్టే. మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులను కొనుగోలు చేయాలి. దసరా నుంచి దీపావళి వరకూ జీఎస్టీ 2.0 సంస్కరణలపై ప్రతి ఇంటికీ తెలిసేలా ప్రచారం నిర్వహిస్తాం. 65 వేలకు పైగా సమావేశాలు, అవగాహనా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించాం.” అని చంద్రబాబు వివరించారు.
పొదుపు ఓవైపు... అభివృద్ధి మరోవైపు
“సంస్కరణలతో అభివృద్ధి, సంపద సృష్టి జరిగే అవకాశం ఉంటుంది. నిత్యావసర సరకులు, గృహోపకరణాలు, ఔషధాలు, విద్య, స్టేషనరీ ఉత్పత్తులు, వస్త్రాలు, క్రీడా వస్తువులు, మహిళలు, చిన్నారులు, రవాణా, హోటల్లు ఇలా వేర్వేరు రంగాల్లో పన్నులు తగ్గుతాయి. వ్యవసాయ ఉపకరణాల ధరలు కూడా గణనీయంగా తగ్గుతాయి.
గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా కూడా ప్రచారం నిర్వహించాలని నిర్ణయించాం. 10 వేల రైతు సేవా కేంద్రాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తాం. రాష్ట్రంలో ప్రతీ పౌరుడికీ వివరాలు తెలిసేలా అన్ని టచ్ పాయింట్లు ఏర్పాటు చేస్తాం. విద్యా సంస్థలు, కళాశాలల్లో వ్యాస రచనా పోటీలు నిర్వహిస్తాం. సోమవారం నుంచి అక్టోబరు 19వ తేదీ వరకు 26 జిల్లాల్లో జీఎస్టీ సంస్కరణలపై ప్రచారం చేస్తాం.
అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రత్యేకంగా కార్యక్రమాలు చేపడతాం. ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్ధులు ఇలా వేర్వేరు రకాలుగా విస్తృత ప్రచారం చేయాలని నిర్ణయించాం. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల్లో ప్రచారం, హోర్డింగులు, మాస్ అవుట్ రీచ్ ఇంటర్వూలు, సోషల్ మీడియా ద్వారా సెల్ఫీ కంటెస్ట్ వంటి వినూత్న కార్యక్రమాల ద్వారా విస్తృత ప్రచారం చేపడతాం.
అలాగే సాండ్ ఆర్ట్ వంటి వాటి ద్వారా విస్తృతంగా ప్రచారం చేపడతాం. అలాగే జీఎస్టీ సంస్కరణలపై సెమినార్లను కూడా నిర్వహిస్తాం. దుకాణాల వద్ద కూడా జీఎస్టీ తర్వాత తగ్గింపు ధరలను కూడా ప్రదర్శించేలా చూస్తాం. జీఎస్టీ 2.0 సంస్కరణలు భవిష్యత్ తరానికి ఉపకరిస్తాయి.
స్వర్ణాంధ్ర దిశగా అన్ని వర్గాలనూ నడిపించేలా ఈ సంస్కరణలు ఉన్నాయి. ప్రజలందరికీ దసరా దీపావళి పండుగ శుభాకాంక్షలు. తగ్గిన ధరలతో అందరూ ఆనందంగా ఈ పండుగలు జరుపుకోవాలని కోరుతున్నాను' అని సీఎం చంద్రబాబు అన్నారు.