నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల కేంద్రానికి చెందిన బాస గణేష్ అనే యువకుడు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) దేశంలోని అబుదాబిలో వ్యవసాయ కూలీ (అగ్రికల్చర్ వర్కర్) వీసాతో పని చేస్తున్నాడు. ఏమైందో.. ఎలా జరిగిందో... కానీ, 2025 జూన్ మొదటి వారం నుండి దుబాయిలోని రషీదియా పోలీస్ స్టేషన్ లో అదుపులో ఉన్నాడు. టెలికం సిమ్ కార్డులు మరియు బ్యాంకింగ్ లావాదేవీలకు సంబంధించిన ఒక కేసులో గణేష్ ను దుబాయి పోలీసులు విచారిస్తున్నారు.
గణేష్ కు న్యాయ సహాయం అందించి, దుబాయి జైలు నుంచి విడిపించాలని... అతని తల్లి బాస లక్ష్మి, అక్క సంజన మంగళవారం, హైదరాబాద్ లోని 'సీఎం ప్రవాసీ ప్రజావాణి' లో ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి పేరిట వినతిపత్రం సమర్పించారు.
కాంగ్రేస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్టీసీ 'మహాలక్ష్మి' ఉచిత ప్రయాణం సౌకర్యాన్ని వినియోగించుకుని తాము మోర్తాడ్ నుంచి హైదరాబాద్ కు చేరుకున్నామని వారు తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వ నియమిత ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ ఛైర్మన్ మంద భీంరెడ్డి వారికి మార్గదర్శనం చేశారు. ఈ సందర్భంగా ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం ప్రతినిధి మహ్మద్ బషీర్ అహ్మద్, సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ (సాటా), రియాద్ శాఖ ఉపాధ్యక్షులు మహ్మద్ నూరుద్దీన్ లు గణేష్ కుటుంబానికి భరోసా ఇచ్చారు.