విజయవాడ నగరం ఈసారి దసరా సంబరాలతో పాటు ఉత్సవ్ సంబరాలు ఘనంగా ప్రారంభమైంది. కృష్ణా నది ఒడ్డున పున్నమి ఘాట్‌లో జరిగిన ఈ వేడుకలు మొదటి రోజు నుంచే సందడి చేసాయి. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన డ్రోన్ షో, లైవ్ బ్యాండ్ సంగీతం చూసిన వారిని మంత్ర ముగ్ధుల్ని చేశాయి. తుమ్మలపల్లి కళాక్షేత్రం, ఘంటసాల సంగీత కళాశాలలో బుర్రకథలు, నాటకాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మంత్రి నారా లోకేశ్‌తో పాటు కొల్లు రవీంద్ర, కందుల దుర్గేశ్, సత్యకుమార్, ఎంపీ కేశినేని చిన్ని వంటి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. దసరా వేడుకలతో కలిపి విజయవాడ ఉత్సవ్ జరపడం వల్ల నగరమంతా ఒకే రంగుల హరివిల్లు మాదిరిగా మెరిసిపోయింది అని తెలిపారు.
విజయవాడ చరిత్ర, సంస్కృతిని గుర్తు చేస్తూ వెంకయ్యనాయుడు ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ, ఒకే నగరం- ఒకటే సంబరం అన్న నినాదం విజయవాడకు తగ్గట్టే ఉంది. ఇలాంటి ఉత్సవాలు భవిష్యత్ తరాలకు తెలుగు సంస్కృతి, కళల వైభవాన్ని పరిచయం చేస్తాయి. భాష పోతే శ్వాస పోయినట్టే. కాబట్టి తెలుగు భాషను కాపాడుకోవడం అందరి బాధ్యత అని అన్నారు.
మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ, ఇప్పటివరకు మైసూరు ఉత్సవాలు పేరు గడించాయి. ఇకపై విజయవాడ దసరా ఉత్సవాలే అందరికీ గుర్తు రావాలి. కొండపై దుర్గమ్మ, కింద కృష్ణమ్మ ఉన్న ఈ పవిత్రభూమిలో జరుపుతున్న ఈ సంబరం వన్‌టైమ్ వండర్‌గా మిగిలిపోకూడదు. లండన్‌లో వింటర్ వండర్‌ల్యాండ్ లాగే ప్రతి ఏడాది మరింత పెద్ద ఎత్తున జరగాలి అన్నారు.
ఉత్సవం భాగంగా వ్యవసాయ, వాణిజ్య, ఆటోమొబైల్, చేనేత రంగాలకు చెందిన 600కి పైగా స్టాళ్లు ఏర్పాటు చేశారు. అలాగే రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. నాటకాలు, నృత్యాలు, సంగీత ప్రదర్శనలు ప్రతి వేదికపై సందడి చేస్తున్నాయి.
గత ప్రభుత్వాలు తెలుగు సంస్కృతిని నిర్లక్ష్యం చేశాయని టీడీపీ నేత వర్ల రామయ్య వ్యాఖ్యానించగా, నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ మాట్లాడుతూ, తెలుగు సంప్రదాయాలను కాపాడుకోవడం కోసం ఈ ఉత్సవాలు ఒక పెద్ద వేదిక అన్నారు.
ఈ ఏడాది విజయవాడ ఉత్సవ్ మొత్తం 11 రోజుల పాటు జరగనుంది. దాదాపు 250కిపైగా సాంస్కృతిక, పౌరాణిక, నృత్య, కళా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రారంభ వేడుకలోనే ఫైర్‌వర్క్స్ షో, డ్రోన్ షో ప్రేక్షకులను కట్టిపడేశాయి. దుర్గమ్మ, పింగళి వెంకయ్య, ఎన్టీఆర్, మోక్షగుండం విశ్వేశ్వరయ్య రూపాలతో ఆకాశంలో మెరిసిన డ్రోన్లు ప్రతి ఒక్కరినీ ఆకర్షించాయి.
విజయవాడ ఉత్సవ్ మొదటి రోజే విశేష స్పందన తెచ్చుకుంది. రాష్ట్రం నలుమూలల నుంచి పర్యాటకులు తరలివచ్చారు. భవిష్యత్తులో ఇది కేవలం నగరానికి మాత్రమే కాకుండా రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చే ఉత్సవంగా ఎదగాలని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.