ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మచిలీపట్నం-రేపల్లె రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలకు రైల్వే శాఖ సానుకూలంగా స్పందించింది. ఈ లైన్ కోసం డీపీఆర్ సిద్ధం చేసి రైల్వే బోర్డు వద్దకు పంపగా, దివిసీమ ప్రజల చిరకాల కోరిక నెరవేరబోతోందని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి వెల్లడించారు. ఆయన చొరవతో ఈ ప్రాజెక్టు దిశగా ముందడుగు పడింది.
రైల్వే బోర్డు ఛైర్మన్ సతీష్‌కుమార్‌తో పాటు పలువురు రైల్వే అధికారులను ఎంపీ బాలశౌరి కలుసుకుని ప్రాజెక్టు ప్రాధాన్యతను వివరించారు. డీపీఆర్ పూర్తి చేయాలని, త్వరగా అనుమతులు మంజూరు చేయాలని ఆయన కోరారు. దీనికి బోర్డు ఛైర్మన్ సానుకూలంగా స్పందించి, త్వరలోనే ఈ లైన్ పనులను వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఈ ప్రాజెక్టు పట్ల ఆశలు పెరిగాయి.
ఈ లైన్ అందుబాటులోకి వస్తే విజయవాడ జంక్షన్ మీదుగా వెళ్లే హౌరా-చెన్నై రైళ్ల రద్దీ తగ్గనుంది. అంతేకాకుండా సుమారు 70 కి.మీ దూరం తగ్గడం వల్ల ప్రయాణ సమయం గణనీయంగా ఆదా అవుతుంది. సరకు రవాణా ఖర్చులు కూడా తగ్గుతాయని అధికారులు చెబుతున్నారు. మచిలీపట్నం పోర్టు పూర్తికానుండటంతో ఈ రైల్వే లైన్ మరింత కీలకంగా మారనుంది.
మొత్తం 131.30 కి.మీ పొడవుతో ఈ లైన్ ప్రతిపాదించబడింది. ఇందులో మచిలీపట్నం-రేపల్లె 45.30 కి.మీలు, రేపల్లె-బాపట్ల 48.30 కి.మీలు ఉండనున్నాయి. ఈ లైన్ రేపల్లె, నిజాంపట్నం, బాపట్ల మీదుగా వెళ్తుంది. దీంతో కోస్తా తీర ప్రాంత అభివృద్ధికి ఇది దోహదం అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
అంతేకాకుండా, కృష్ణా జిల్లాలో ట్రాఫిక్ తగ్గించేందుకు రైల్వే ఓవర్ బ్రిడ్జిలు (ROBలు), అండర్ బ్రిడ్జిలు నిర్మించాలని ఎంపీ బాలశౌరి రైల్వే బోర్డు అధికారులను కోరారు. రామవరప్పాడు, గూడవల్లి, బందరు పోర్టు, గుడివాడ, పెడన తదితర ప్రాంతాల్లో ఈ బ్రిడ్జిలు అవసరమని వివరించారు. అదనంగా, మచిలీపట్నం నుండి తిరుపతికి రోజువారీ రైలు నడపాలని కూడా అభ్యర్థించారు. ప్రజలకు సౌకర్యం కల్పించేందుకు త్వరలో చర్యలు తీసుకుంటామని రైల్వే బోర్డు హామీ ఇచ్చింది.