భారతదేశపు గర్వకారణమైన ఇండియన్ రైల్వేస్ మరో మైలురాయిని చేరేందుకు అంచున నిలిచింది. ప్రపంచంలోనే అతి పెద్ద రవాణా నెట్‌వర్క్‌గా పేరుపొందిన భారత రైల్వేలు, సంపూర్ణ విద్యుదీకరణ లక్ష్యాన్ని సాధించడానికి కేవలం ఒక్క అడుగు దూరంలో ఉంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 99 శాతం రైల్వే మార్గాల్లో విద్యుదీకరణ పూర్తి కాగా, మిగిలిన 1 శాతం మాత్రమే పనులు జరుగుతున్నాయి. ఈ పనులు కూడా పూర్తయితే.. దేశంలో రైల్వే నెట్‌వర్క్ 100 శాతం విద్యుదీకరణ పొందిన అరుదైన ఘనతను సాధిస్తుంది.
ఇప్పటికే 25 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో రైల్వే ట్రాక్‌లు పూర్తిగా విద్యుదీకరణ చేయబడ్డాయి. ఇంకా ఐదు రాష్ట్రాలు — అస్సాం, తమిళనాడు, కర్ణాటక, రాజస్థాన్, గోవా — 90 శాతం కంటే ఎక్కువ పనులు పూర్తి చేశాయి. వీటిలో అస్సాం అత్యధికంగా 269 కి.మీ ట్రాక్‌లు మిగిలి ఉండగా, తమిళనాడు (169 కి.మీ), కర్ణాటక (151 కి.మీ) ట్రాక్‌లు ఇంకా విద్యుదీకరణ కావాల్సి ఉంది. రాజస్థాన్ విషయంలో కేవలం 1 శాతం పనులే మిగిలి ఉన్నాయి.
రైల్వే అధికారులు తెలిపిన ప్రకారం, మార్చి 2026లోగా పూర్తి చేయాల్సిన లక్ష్యాన్ని ముందుగానే సాధించే అవకాశం ఉందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. విద్యుదీకరణ ప్రాసెస్‌లో భాగంగా సౌర విద్యుత్తు వినియోగాన్ని గరిష్ట స్థాయిలో పెంచుతున్నామని వారు వెల్లడించారు. ఈ చారిత్రాత్మక ముందడుగు పర్యావరణ పరిరక్షణకే కాకుండా, దేశ ఆర్థికాభివృద్ధికి కూడా కొత్త దిశ చూపనుంది.