రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో వస్తున్న 'కూలీ' సినిమా కోసం దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. కొన్ని రోజుల్లోనే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలని అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు. సినిమా పాటలు ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ చేయగా, మరో కొన్ని గంటల్లో విడుదల కాబోతున్న ట్రైలర్ ఆ అంచనాలను మరింత పెంచనుంది.
అయితే, ఈ సినిమా గురించి వచ్చిన ఒక తాజా వార్త అభిమానులను కాస్త ఆందోళనలోకి నెట్టింది. రజనీకాంత్ కెరీర్‌లోనే ఇలా జరగడం ఇదే మొదటిసారి కావడంతో అభిమానులు కంగారు పడుతున్నారు. ఆగస్టు 14న విడుదల కానున్న ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. గ్యాంగ్‌స్టర్ కథాంశంతో వస్తున్న ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ ఊహించని షాక్ ఇచ్చింది. సినిమాలో ఎక్కువగా యాక్షన్, హింస, రక్తపాతం ఉండటంతో 'A' సర్టిఫికేట్ ఇచ్చింది. దీంతో 18 సంవత్సరాల లోపు వారికి ఈ సినిమా చూసేందుకు అనుమతి లేదు.
ఈ విషయంపై దర్శకుడు లోకేష్ కనగరాజ్ స్పందించారు. కథలో భాగంగా వచ్చే హింసాత్మక సన్నివేశాల్లో ఎక్కడా రాజీ పడలేదని, భావోద్వేగాలను సరిగ్గా చూపించడానికి హింస అవసరమైందని ఆయన అన్నారు. సెన్సార్ సభ్యులు అభ్యంతరాలు చెప్పినా తాను పట్టించుకోలేదని తెలిపారు. రజనీకాంత్ కెరీర్‌లో 'A' సర్టిఫికేట్ పొందిన సినిమా ఇదే కావడం విశేషం.
మరోవైపు, 'కూలీ' సినిమా వెయ్యి కోట్ల రూపాయల వసూళ్లు సాధిస్తుందని ప్రచారం జరుగుతోంది. దానికి తగ్గట్టుగానే అడ్వాన్స్ బుకింగ్‌లో సినిమా అదరగొడుతోంది. అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే రూ. 4.84 కోట్లు దాటాయి. 800 షోలలో 20,500 టికెట్లు అమ్ముడుపోవడం సినిమాపై ఉన్న బజ్‌ను తెలియజేస్తోంది.
అయితే, ఆగస్టు 14న 'వార్ 2' కూడా విడుదల అవుతుండటంతో బాక్సాఫీస్ వద్ద పోటీ తప్పేలా లేదు. భారతదేశంలో ఇప్పటివరకు 'A' సర్టిఫికేట్ పొందిన ఏ సినిమా కూడా వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరలేదు. ఈ రికార్డును 'కూలీ' బద్దలు కొడుతుందేమో చూడాలి.
ఈ సందర్భంగా ఫ్రెండ్‌షిప్ డే కానుకగా శనివారం రాత్రి 7 గంటలకు విడుదల కానున్న ట్రైలర్ పోస్టర్ నెక్స్ట్ లెవల్‌లో ఉంది. పోస్టర్‌లో నాగార్జున సుత్తి పట్టుకుని, రక్తంతో తడిచిన దుస్తులతో కనిపించి అంచనాలను పెంచారు.