ఇండిగో విమానం (Indigo plane) లో ఓ ప్రయాణికుడు, మరో ప్రయాణికుడిపై భౌతిక దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. ఈక్రమంలో విమానంలో చెంపదెబ్బ తిన్న ప్రయాణికుడు అదృశ్యమైనట్లు తెలుస్తోంది. ఈవిషయాన్ని అతడి కుటుంబసభ్యులు తెలిపినట్లు పలు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.
చెంపదెబ్బ తిన్న వ్యక్తి అస్సాంలోని కాచార్ జిల్లాకు చెందిన హుస్సేన్ అహ్మద్ మజుందార్ అతడి కుటుంబసభ్యులు పేర్కొన్నారు. ఈ ఘటన అనంతరం అతడు ఇంటికి రాలేదని, ఫోన్ స్విచ్చాఫ్ వస్తోందని తెలిపారు. 'హుస్సేన్ ముంబయిలోని ఓ హోటల్లో పనిచేస్తున్నాడు. పలుమార్లు ఇదే మార్గంలో ఇంటికి వచ్చేవాడు. ఎప్పటిలాగానే అతడి కోసం ఎయిర్పోర్టుకు వెళ్లాం. అయితే, అతడు కన్పించలేదు.
ఆ తర్వాత వైరల్ అయిన వీడియో ద్వారా గొడవ గురించి తెలిసింది. తర్వాత హుస్సేన్ ఆచూకీ కోసం ఎంత ప్రయత్నించినప్పటికీ తెలియరాలేదు' అని హుస్సేన్ తండ్రి అబ్దుల్ మన్నన్ మజుందార్ పేర్కొన్నారు. విమానాశ్రయంలోని కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (CISF) అధికారులకు దీనిపై సమాచారం ఇచ్చామని తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.