ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, ఒక దేశం లేదా రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని చెప్పడానికి రోడ్లు, రవాణా మార్గాలే ప్రధాన సూచికలని అన్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ దూరదృష్టితో ప్రవేశపెట్టిన స్వర్ణచతుర్భుజి రహదారుల వల్ల దేశం గణనీయంగా అభివృద్ధి చెందిందని ఆయన గుర్తుచేశారు.
ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో హైవేల నిర్మాణ వేగం మూడు రెట్లు పెరిగిందని అన్నారు. "అడవితల్లి బాట" వంటి కార్యక్రమాల ద్వారా గిరిజన ప్రాంతాల్లోనూ రోడ్లు వేస్తున్నారని, దశాబ్దాలుగా రోడ్లు లేని గ్రామాలకు ఇప్పుడు రహదారులు అందుబాటులోకి వస్తున్నాయని తెలిపారు.
గిరిజనుల డోలీ మోతలు తగ్గించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా కృషి చేస్తున్నాయని చెప్పారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి మెరుగైన రోడ్లు ఎంతగానో ఉపయోగపడతాయని, గతంలో కూల్చివేతలు, రోడ్లు వేయని ప్రభుత్వాన్ని చూశామని గుర్తుచేశారు.
కూటమి ప్రభుత్వం వచ్చే 15 సంవత్సరాల పాటు బలమైన నాయకత్వాన్ని కొనసాగించాలని ఆకాంక్షించారు. గత ప్రభుత్వం కూల్చివేతలతో తన పాలన మొదలుపెడితే, కూటమి ప్రభుత్వం ప్రతి గ్రామంలో రోడ్ల గుంతలను పూడ్చి కొత్త రోడ్లను నిర్మిస్తోందని వివరించారు.
కూటమి ఐక్యతను దెబ్బతీసే ప్రయత్నాలను అందరం కలిసి ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. కూటమి నాయకుల మధ్య చిన్నపాటి విభేదాలు వచ్చినా వాటిని పరిష్కరించుకుని ముందుకు సాగాలని అన్నారు. భారతదేశం సుస్థిర ఆర్థికాభివృద్ధి దిశగా ముందుకు వెళ్తోందని, 2047 నాటికి "వికసిత్ భారత్" లక్ష్యాన్ని చేరుకోవడానికి మౌలిక వసతుల కల్పన ప్రధానమని పవన్ నొక్కి చెప్పారు.
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని "హైవే మాన్ ఆఫ్ ఇండియా"గా అభివర్ణించారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీల దార్శనికతతో రాష్ట్రం, దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు.
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో కలిసి రూ. 5 వేల కోట్ల విలువైన 29 జాతీయ రహదారుల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు.