ఒక స్త్రీ గర్భం దాల్చిన క్షణం నుంచే ఆమె జీవన విధానం, ఆహారం మొత్తం కొత్త మార్పులు చోటు చేసుకుంటాయి. ఇంట్లో అందరి సలహాలు, జాగ్రత్తలు ఒకవైపు ఉంటే — తల్లి తినే ఆహారం బిడ్డ ఆరోగ్యం, ఎదుగుదలపై చూపించే ప్రభావం మరొకవైపు ఉంటుంది. వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, గర్భిణి తీసుకునే ప్రతి ఆహారమే బిడ్డ శారీరక, మానసిక అభివృద్ధికి పునాది వేస్తుంది.
గర్భం దాల్చిన రోజు నుంచి బిడ్డకు రెండేళ్లు నిండేవరకు అత్యంత కీలకమైనవి. ఈ కాలంలో తల్లి ఆహారం సరిగ్గా లేకపోతే బిడ్డ తక్కువ బరువుతో పుట్టడం, తరచూ జబ్బులు రావడం, భవిష్యత్తులో షుగర్, బీపీ, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని పరిశోధనలు సూచిస్తున్నాయి.
రెండో, మూడో నెలల నుంచే తల్లికి రోజుకు అదనంగా సుమారు 350 క్యాలరీలుశఅవసరం. అలాగే 8 నుంచి 18 గ్రాముల ప్రొటీన్ ఉండే ఆహారం తీసుకోవడం శ్రేయస్కరం.
బిడ్డ పుట్టిన తర్వాత పాలిచ్చే సమయంలో ఈ అవసరాలు మరింత పెరుగుతాయి. మొదటి ఆరు నెలల్లో 600 క్యాలరీలు, 13 గ్రాముల ప్రొటీన్, ఆ తరువాత 520 క్యాలరీలు, 10 గ్రాముల ప్రొటీన్ అవసరమవుతాయని నిపుణులు చెబుతున్నారు.
ఇంకా తల్లికి రోజూ అయోడిన్ (290 మైక్రోగ్రాములు), కోలిన్ (550 మిల్లీగ్రాములు) తీసుకోవడం వల్ల బిడ్డ మెదడు అభివృద్ధి మెరుగవుతుంది.
ఫోలిక్ యాసిడ్ గర్భధారణ తొలి నెలల్లో తీసుకుంటే బిడ్డలో నాడీ లోపాలు రాకుండా ఉంటుంది.
ఐరన్ తల్లి రక్తహీనతను నివారించి బిడ్డ బరువును నిలబెడుతుంది.
కాల్షియం, విటమిన్ D ఎముకల బలానికి అవసరం.
విటమిన్ A, అయోడిన్ మెదడు అభివృద్ధికి దోహదం చేస్తాయి.
విటమిన్ B12, C ఐరన్ శోషణను పెంచి రోగనిరోధక శక్తిని బలపరుస్తాయి.
రోజువారీ ఆహారంలో ఇవి తప్పక ఉండాలి
తాజా కూరగాయలు, పండ్లు, పప్పులు, గింజలు, డ్రైఫ్రూట్స్, గుడ్లు, చేపలు, మాంసం, పాలు వంటి పదార్థాలను తగిన మోతాదులో తీసుకోవాలి.
జామ, నారింజ, వంటి పండ్లు విటమిన్ Cకి మంచి వనరులు. ఆకుకూరలు, పప్పులు, నట్స్ ఫోలిక్ యాసిడ్, ఐరన్ అందిస్తాయి. రోజుకి కనీసం రెండు లీటర్ల నీళ్లు తాగడం అలవాటు చేసుకోవాలి.
టీ, కాఫీ ఎక్కువగా తాగితే ఐరన్ శోషణ తగ్గిపోతుంది.
అధిక ఉప్పు, చక్కెర, నూనె ఉన్న పదార్థాలు దూరంగా ఉంచాలి శుభ్రత లేని ఆహారాలు తినడం ప్రమాదకరం.
గర్భిణులు ఏ సప్లిమెంట్లు, డైట్ ప్లాన్లు ప్రారంభించేముందు తప్పనిసరిగా వైద్యుడి సలహా తీసుకోవాలి. ప్రతి తల్లీ శరీర పరిస్థితి వేరు కాబట్టి ఒకరికి సరిపోయేది మరొకరికి కాకపోవచ్చు.