భారత సుప్రీంకోర్టులో కొత్త అధ్యాయం మొదలుకానుంది. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో జస్టిస్ సూర్యకాంత్ తదుపరి భారత ప్రధాన న్యాయమూర్తిగా (CJI) బాధ్యతలు స్వీకరించనున్నారు. సాంప్రదాయం ప్రకారం అత్యంత సీనియర్ జడ్జి ఈ పదవికి అర్హత పొందుతారు. అదే క్రమంలో జస్టిస్ గవాయ్ కేంద్ర న్యాయశాఖకు సూర్యకాంత్ పేరును సిఫారసు చేశారు. రాష్ట్రపతి ఆమోదం అనంతరం, నవంబర్ 24న ఆయన దేశంలోని 53వ సీజేఐగా ప్రమాణం చేయనున్నారు.
న్యాయరంగంలో సూర్యకాంత్ ప్రయాణం
హరియాణాలోని హిసార్ పట్టణంలో 1962 ఫిబ్రవరి 10న జన్మించిన సూర్యకాంత్ మధ్యతరగతి కుటుంబానికి చెందినవారు. రోహ్‌తక్‌లోని మహర్షి దయానంద్ యూనివర్సిటీ నుంచి 1984లో లా డిగ్రీ పూర్తి చేశారు. చిన్న పట్టణంలో న్యాయవాదిగా మొదలైన ఆయన ప్రయాణం, అద్భుతమైన కృషితో దేశ అత్యున్నత న్యాయస్థానం వరకు చేరింది.
1985లో పంజాబ్-హరియాణా హైకోర్టులో ప్రాక్టీస్ మొదలుపెట్టిన సూర్యకాంత్, 2000లో హరియాణా అడ్వొకేట్ జనరల్‌గా నియమితులయ్యారు. 2004లో హైకోర్టు జడ్జిగా 2018లో హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా నియమితులయ్యారు. అనంతరం 2019లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.
కీలక తీర్పులు
సుమారు రెండు దశాబ్దాల న్యాయసేవలో జస్టిస్ సూర్యకాంత్ పలు సామాజిక, ప్రజాస్వామ్య, న్యాయపరమైన అంశాలపై ప్రాముఖ్యమైన తీర్పులు ఇచ్చారు.
ఆర్టికల్ 370 రద్దు, వాక్ స్వాతంత్ర్యం, లింగ సమానత్వం, అవినీతి నిరోధం వంటి కేసుల్లో ఆయన తీర్పులు విస్తృత చర్చకు దారితీశాయి.
రాజద్రోహ చట్టాన్ని నిలిపివేయాలి అనే చారిత్రాత్మక నిర్ణయంలో ఆయన భాగమయ్యారు.
ఎన్నికల పారదర్శకతకు బాటలు వేసిన బిహార్ ఓటర్ జాబితా తీర్పు ద్వారా, ప్రజలకు సమాచారం చేరేలా ఆదేశించారు.
న్యాయరంగంలో మహిళా న్యాయవాదులకు 33% ప్రాతినిధ్యం కల్పించాలన్న ఆదేశం, న్యాయరంగ చరిత్రలో గుర్తుంచుకునే నిర్ణయం.
వన్ ర్యాంక్ వన్ పెన్షన్ (OROP) పథకానికి ఆయన మద్దతు తెలిపారు.
పెగాసస్ గూఢచారి సాఫ్ట్‌వేర్ కేసు, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ మైనారిటీ హోదా కేసు, పంజాబ్ పీఎం భద్రతా లోపం దర్యాప్తు ఇవన్నీ ఆయన న్యాయపరమైన సమగ్రతను ప్రతిబింబించిన ముఖ్య కేసులు.
సుప్రీంకోర్టులో లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్‌గా పనిచేస్తూ, సూర్యకాంత్ న్యాయసేవలను అందరికీ చేరేలా కృషి చేశారు. నవంబర్ 24న ఆయన భరత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరిస్తే, 2027 ఫిబ్రవరి 9 వరకు ఆ పదవిలో కొనసాగనున్నారు. న్యాయం ప్రజలందరికీ సమానంగా అందాలనే ఆయన సిద్ధాంతం, రాబోయే కాలంలో న్యాయవ్యవస్థకు కొత్త దిశను చూపే అవకాశంగా మారునుందేమో బహుశా