ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూవినియోగ మార్పిడి ప్రక్రియను పూర్తిగా డిజిటల్ చేయాలని నిర్ణయించింది. ఇకపై ఈ అనుమతులు పూర్తిగా ఆన్‌లైన్‌లోనే అందుబాటులోకి రానున్నాయి. దీనికోసం ప్రభుత్వం డెవలప్‌మెంట్ పర్మిషన్ మేనేజ్‌మెంట్ సిస్టం (DPMS) పేరుతో కొత్త పోర్టల్‌ను ప్రారంభించింది. ఈ పోర్టల్ ద్వారా భూముల వినియోగ మార్పిడి అనుమతులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ఆఫ్‌లైన్ పద్ధతిలో అనుమతులు పొందడంలో ఆలస్యం, మధ్యవర్తిత్వం వంటి సమస్యలు ఎదురవుతుండగా, ఇప్పుడు ఆన్‌లైన్ వ్యవస్థతో పారదర్శకత పెరుగుతుందని ప్రభుత్వం తెలిపింది. దరఖాస్తు చేసుకున్న తర్వాత అధికారులు 45 రోజుల్లోపే ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది.
ఈ ఆన్‌లైన్ సిస్టమ్ ద్వారా భూములను ఒక అవసరం నుంచి మరొక అవసరానికి మార్చుకోవడం చాలా సులభం కానుంది. ఉదాహరణకు వ్యవసాయ భూమిని కమర్షియల్ లేదా రెసిడెన్షియల్ ఉపయోగానికి మార్చుకోవాలనుకునే వారు DPMS పోర్టల్‌లో దరఖాస్తు చేయాలి. ప్రభుత్వం నిర్ణయించిన రుసుమును కూడా ఆన్‌లైన్‌లోనే చెల్లించాలి. ఎకరాకు 1% చొప్పున ఈ ఫీజు నిర్ణయించారు. దరఖాస్తుతో పాటు యాజమాన్య హక్కు పత్రాలు, ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్, బాహ్య అభివృద్ధి ఛార్జీల చెల్లింపు రసీదు, టౌన్ సర్వేయర్ ధ్రువీకరణ, ఎఫ్‌ఎంబీ పత్రాలు, సైట్ మ్యాప్ తదితర అవసరమైన డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాలి.
దరఖాస్తు సమర్పణ అనంతరం, సంబంధిత ప్రాంతం ఆధారంగా వివిధ స్థాయిల్లో అధికారులు పరిశీలిస్తారు. గ్రామ పంచాయతీ పరిధిలోని భూములకు సంబంధించిన దరఖాస్తులను ముందుగా పట్టణాభివృద్ధి సంస్థలు పరిశీలించి, ఆ తర్వాత రాష్ట్ర పట్టణ ప్రణాళిక విభాగానికి పంపుతాయి. మున్సిపల్ లేదా కార్పొరేషన్ పరిధిలో ఉన్న భూముల దరఖాస్తులను స్థానిక సంస్థలు పరిశీలించి, పట్టణాభివృద్ధి సంస్థల ద్వారా డైరెక్టర్ కార్యాలయానికి పంపుతాయి. పట్టణాభివృద్ధి సంస్థ పరిధిలో ఉన్న భూముల దరఖాస్తులు నేరుగా డైరెక్టర్ కార్యాలయానికి వెళ్తాయి. అక్కడ అధికారులు దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, ప్రభుత్వ కమిటీకి పంపిస్తారు.
ఈ కమిటీలో పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి అధ్యక్షుడిగా ఉంటారు. పట్టణ ప్రణాళిక సంచాలకులు, పురపాలక శాఖ ఓఎస్‌డీ, సంబంధిత మున్సిపల్ కమిషనర్, పట్టణాభివృద్ధి సంస్థ వైస్ ఛైర్మన్ సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ తుది ఆమోదం ఇవ్వడం ద్వారా దరఖాస్తు ప్రక్రియ ముగుస్తుంది. మొత్తం ప్రక్రియ 45 రోజుల్లో పూర్తి కావాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నిర్ణయం వల్ల ప్రజలకు భూముల వినియోగ మార్పిడి విషయంలో వేగవంతమైన సేవలు అందుతాయని, అనవసర ఆలస్యాలు, అవినీతి తగ్గుతాయని అధికారులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. వ్యాపార సులభతరం (Ease of Doing Business) లక్ష్యంగా తీసుకున్న ఈ చర్య భూసంబంధిత సేవల్లో కీలకమైన మార్పుగా నిలవనుంది.