ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వక్ఫ్ ఆస్తులు, మసీదులు, దర్గాలు, మదరసాలు తప్పనిసరిగా డిజిటల్ రిజిస్ట్రేషన్ చేయాలని నిర్ణయించింది. ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ తెలిపిన ప్రకారం, నూతనంగా అమల్లోకి వచ్చిన ఉమీద్ యాక్ట్ ప్రకారం ఈ ప్రక్రియను 2025 డిసెంబర్ 6లోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్ ద్వారా రాష్ట్రంలోని అన్ని వక్ఫ్ ఆస్తులు ప్రభుత్వ డేటాబేస్‌లో నమోదు చేయబడతాయి. దీని ద్వారా భూములపై అక్రమ ఆక్రమణలు, మోసపూరిత రిజిస్ట్రేషన్లు నివారించవచ్చని ఆయన పేర్కొన్నారు.
డిజిటల్ రిజిస్ట్రేషన్ కోసం ప్రత్యేకంగా ఉమీద్ పోర్టల్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో వక్ఫ్ ఆస్తుల వివరాలు, కొత్త వక్ఫ్ రిజిస్ట్రేషన్, ఆక్వాఫ్ జాబితా, ముతవల్లీల ఖాతాలు, ఆడిట్ రిపోర్టులు, సమావేశాల వివరాలు వంటి అన్ని సమాచారాన్ని నమోదు చేస్తారు. ఈ ప్రక్రియ పారదర్శకతను పెంచడంతో పాటు ప్రజా ఆస్తులను రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుందని అధికారులు చెబుతున్నారు. నమోదు కాని వక్ఫ్ ఆస్తులు చట్టపరంగా రక్షణ పొందవు కాబట్టి, నిర్వాహకులు ఈ గడువులోపే రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని సూచించారు.
వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ, వక్ఫ్ భూములు దేవుడి ఆస్తులు అని, ముతవల్లీలు కేవలం నిర్వహకులేనని అన్నారు. తక్కువ అద్దెలకు భూములు ఇచ్చి సమాజానికి నష్టం కలిగించకూడదని, వక్ఫ్ ఆదాయాన్ని పెంచి పేదల సంక్షేమానికి వినియోగించాలన్నారు. గత ఏడాదిలో 700 ఎకరాల ఆక్రమిత భూములను తిరిగి స్వాధీనం చేసుకున్నామని, వైజాగ్‌లో 319 ఎకరాలు అన్యాక్రాంతమై ఉన్నట్లు గుర్తించామని వెల్లడించారు. అక్రమ రిజిస్ట్రేషన్లను రద్దు చేసి, కొత్త లీజులతో ఆదాయం రెండింతలు పెరిగిందన్నారు.
ఈ ప్రక్రియను పర్యవేక్షించడానికి వక్ఫ్ బోర్డు కార్యాలయంలో ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ ఏర్పాటుచేశారు. సందేహాలుంటే హెల్ప్‌లైన్ నంబర్ 9490044933 ద్వారా సంప్రదించవచ్చని తెలిపారు. వక్ఫ్ ఆస్తుల నిర్వాహకులు తమ జిల్లాలోని ఇన్స్పెక్టర్ ఆడిటర్ కార్యాలయాన్ని సంప్రదించి, అవసరమైన పత్రాలతో రిజిస్ట్రేషన్ పూర్తిచేయాలని సూచించారు. అన్ని వక్ఫ్ సంస్థలు ఈ ప్రక్రియలో భాగస్వామ్యం కావాలని బోర్డు కోరింది.
ఇక, వక్ఫ్ బోర్డు సామాజిక సంక్షేమ కార్యక్రమాలను కూడా చేపడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా “తాలిం ఏ హునర్” పేరుతో 28 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ప్రారంభిస్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని ఉపాధి అవకాశాల కోసం శిక్షణా కార్యక్రమాలు చేపట్టనున్నారు. అదేవిధంగా, రానున్న విద్యా సంవత్సరంలో 500 మంది ప్రతిభావంతులైన ముస్లిం విద్యార్థులకు ఉచిత ఇంటర్మీడియట్ విద్య అందించనున్నట్లు చైర్మన్ తెలిపారు. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణతోపాటు సామాజిక అభివృద్ధి దిశగా కూడా వక్ఫ్ బోర్డు కృషి చేస్తోంది.