ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల రంగంలో కొత్త చరిత్ర రాయడానికి సమయం ఆసన్నమైంది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో ప్రపంచ ప్రసిద్ధ ఆర్సెలార్ మిత్తల్ సంస్థ భారీ ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు పూర్తయ్యాయి. మొత్తం రూ.1.47 లక్షల కోట్ల పెట్టుబడితో ఈ ప్రాజెక్టు అమలు కానుంది. వచ్చే నెలలోనే ఈ మెగా ఫ్యాక్టరీకి శంకుస్థాపన జరగనుందని, ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్నట్లు సమాచారం. అయితే ఆయన వర్చువల్‌గా పాల్గొంటారా లేక స్వయంగా వస్తారా అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు.
ఈ ప్రాజెక్ట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం 2,020 ఎకరాల భూమిని కేటాయించింది. ఇప్పటికే రోడ్లు, డ్రైనేజ్, పైప్‌లైన్‌ల వంటి మౌలిక సదుపాయాల పనులు వేగంగా సాగుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా ఫోకస్ చేయడంతో కేంద్ర ప్రభుత్వం సహకారం లభించింది. ఇటీవల ప్రజాభిప్రాయ సేకరణ కూడా పూర్తయి, స్థానిక ప్రజలంతా ఏకగ్రీవంగా ఈ పరిశ్రమకు మద్దతు తెలిపారు.
రెండు దశల్లో ఈ కర్మాగారం నిర్మాణం జరగనుంది. మొదటి దశలో 7.3 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యంతో 2029 నాటికి పూర్తి చేయనున్నారు. రెండో దశలో ఉత్పత్తి సామర్థ్యాన్ని 10.5 మిలియన్ టన్నులకు పెంచుతూ 2033 నాటికి పూర్తి చేయాలని ప్రణాళిక ఉంది. ఈ రెండు దశలతో కలిపి సుమారు 70 వేల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి లభిస్తుందని అంచనా.
నక్కపల్లి, డీఎల్‌పురం, వేంపాడు, చందనాడ ప్రాంతాల్లో భూముల సేకరణ పూర్తయ్యింది. పరిశ్రమ స్థాపనతో పాయకరావుపేట నియోజకవర్గం అభివృద్ధి దిశగా పరిగెత్తనుంది. ముఖ్యంగా మహిళలకు ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని అధికారులు చెబుతున్నారు.
ఇక ఇదే ప్రాంతంలో మరో కొత్త ప్రాజెక్ట్‌గా బొమ్మల తయారీ పరిశ్రమ ఏర్పాటుకు కూడా ప్రభుత్వం దారితీస్తోంది. ఈ పరిశ్రమ స్థాపించబడితే సుమారు 25 వేల మంది మహిళలకు ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది.
ఈ మెగా ప్రాజెక్ట్ ప్రారంభం ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల పునరుద్ధరణకు నాంది అవుతుందనే అభిప్రాయం నిపుణులది. భారీ పెట్టుబడులు, విస్తృత ఉపాధి అవకాశాలతో ఈ ఫ్యాక్టరీ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపునిస్తుందనడంలో సందేహం లేదు.