మనం అక్టోబర్ నెల చివరి వారంలోకి వచ్చేసినట్టే. ఇంకొన్ని రోజుల్లో కొత్త నెల నవంబర్ 2025 లోకి అడుగు పెడతాం. అయితే, కొత్త నెల ప్రారంభం అంటేనే కొన్ని ఆర్థిక పరమైన అంశాలు మరియు నిబంధనల్లో మార్పులు అమలులోకి వస్తుంటాయి. ఇందులో కొన్ని మన నిత్య జీవితాన్ని నేరుగా ప్రభావితం చేసేవి కూడా ఉంటాయి.
బ్యాంకింగ్ లావాదేవీలు, గ్యాస్ ధరలు (Gas Prices), ఆధార్ కార్డు (Aadhaar Card), మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు వంటి అంశాల్లో నవంబర్ 1, 2025వ తేదీ నుంచే కీలక మార్పులు రాబోతున్నాయి. వీటి గురించి ప్రతి ఒక్కరూ తప్పకుండా తెలుసుకోవాలి, లేదంటే మీరు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంది.
ప్రతి నెలా 1వ తేదీన ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను చమురు మార్కెటింగ్ సంస్థలు సమీక్షిస్తాయి. గ్యాస్ ధరలు అప్పటి మార్కెట్ పరిస్థితులను బట్టి పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. గత మూడు నెలల నుంచి 19 కిలోల కమెర్షియల్ (Commercial) గ్యాస్ సిలిండర్ ధరలను పెంచుతూ వస్తున్నారు.
ఈసారి నవంబర్ 1వ తేదీన సైతం 14 కిలోల వంట గ్యాస్ (Cooking Gas), 19 కిలోల కమెర్షియల్ సిలిండర్ ధరల్లో మార్పులు ఉండవచ్చు. వీటితో పాటు సీఎన్‌జీ (CNG), పీఎన్‌జీ (PNG) ధరలను సైతం సవరించే అవకాశాలు ఉన్నాయి. గ్యాస్ యూజర్లు ఈ విషయంపై కచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తమ క్రెడిట్ కార్డ్ యూజర్లకు (Credit Card Users) ఒక షాక్ (Shock) ఇచ్చింది. నవంబర్ 1 నుంచి కొన్ని రకాల చెల్లింపులపై కొత్త ఛార్జీలు విధించనుంది.
క్రెడ్ (Cred), మొబిక్విక్ (MobiKwik), చెక్ (CheQ) వంటి థర్డ్ పార్టీ యాప్స్ (Third-Party Apps) ద్వారా చేసే ఎడ్యుకేషన్ చెల్లింపులపై (Education Payments) 1 శాతం ఛార్జ్ పడుతుంది. స్కూల్స్, కాలేజీలు, యూనివర్శిటీల్లో ఫీజులు ఇలా కడితే అదనంగా ఈ భారం మోయాల్సి వస్తుంది.
అలాగే, రూ. 1000 ఆపైన వాలెట్ లోడింగ్ చేస్తే కూడా 1 శాతం ఛార్జ్ పడుతుంది. కార్డ్ టు చెక్ చెల్లింపులకు రూ. 200 వరకు ఛార్జీలు వర్తిస్తాయి. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు వాడుతున్నవారు ఈ మార్పులను తప్పకుండా గుర్తుంచుకోవాలి.
బ్యాంకింగ్ లా సవరణ చట్టం 2025ని నవంబర్ 1వ తేదీ నుంచే అమలులోకి తీసుకొస్తున్నారు. ఈ కొత్త రూల్ ఖాతాదారులకు చాలా ఉపశమనం కలిగిస్తుంది. ఇకపై బ్యాంక్ ఖాతాదారులు తమ ఖాతాలు (Accounts), లాకర్లు (Lockers), సేఫ్ కస్టడీలకు ఏకంగా నలుగురు నామినీలను ఎంచుకోవచ్చు.
అలాగే, ఎవరికి ఎంత వాటా (Share) ఇవ్వాలి అనేది కూడా నిర్ణయించుకోవచ్చు. మొదటి నామినీ మరణిస్తే, ఆటోమెటిక్‌గా రెండో నామినీకి అధికారం వస్తుంది. బ్యాంకింగ్ చట్టాల్లో పారదర్శకతను పెంచేందుకు ఆర్‌బీఐ (RBI) ఈ కొత్త రూల్స్ తీసుకొచ్చింది. సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారుల రక్షణ కోసం కీలక నిర్ణయం తీసుకుంది.
ఏఎంసీ (AMC) ఉద్యోగి లేదా వారి బంధువులు రూ. 15 లక్షలకు మించి ట్రాన్సాక్షన్లు చేస్తే, ఆ వివరాలను సదరు కంపెనీ కంప్లైయన్స్ ఆఫీసరుకు తప్పకుండా తెలియజేయాల్సి ఉంటుంది. ఈ దశ పెట్టుబడిదారుల రక్షణను బలోపేతం చేస్తుందని, అవకతవకలు జరగకుండా నిరోధిస్తుందని సెబీ చెబుతోంది.
ఆధార్ జారీ సంస్థ UIDAI ఆధార్ కార్డ్ అప్‌డేట్ ప్రక్రియను మరింత సులభతరం (Simplified) చేసింది. ఆధార్ కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం లేకుండానే పేరు, అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నంబర్ వంటి వివరాలను ఆన్‌లైన్ ద్వారా, ఇంట్లో నుంచే అప్‌డేట్ చేసుకోవచ్చు.
బయోమెట్రిక్ వివరాల (Biometric Details) కోసం అయితేనే ఆధార్ కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది. కొత్త వ్యవస్థ ప్రకారం, మీ వివరాలను పాన్ (PAN), పాస్‌పోర్ట్ (Passport), రేషన్ కార్డు (Ration Card), స్కూల్ రికార్డుల వంటి ప్రభుత్వ డేటాబేస్‌లతో (Databases) ఆటోమేటిక్‌గా ధ్రువీకరిస్తుంది. దీని వల్ల నేరుగా పత్రాలు అప్‌లోడ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఈ మార్పులన్నీ నవంబర్ 1, 2025 నుండి అమలులోకి వస్తాయి కాబట్టి, ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించడం తప్పనిసరి.