అమెరికాలో అక్రమ వలసదారులపై మరోసారి భారీ చర్యలు ప్రారంభమయ్యాయి. దేశ చట్టాలను ఉల్లంఘించి నివసిస్తున్న విదేశీయులను గుర్తించి, వారిని స్వదేశాలకు పంపే ప్రక్రియను అమెరికా ప్రభుత్వం వేగవంతం చేసింది. ఈ క్రమంలో తాజాగా 54 మంది భారతీయులను తిరిగి భారత్‌కు పంపింది.
అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు వీరిని హర్యానాకు చెందినవారిగా గుర్తించారు. వారిలో కర్నాల్ జిల్లాకు 16 మంది, కైథల్‌కు 15 మంది, అంబాలా జిల్లాకు 5 మంది, యమునానగర్ మరియు కురుక్షేత్ర జిల్లాలకు 4 మంది చొప్పున ఉన్నారు. జింద్ నుంచి 3 మంది, సోనిపట్ నుండి 2 మంది, పంచ్‌కుల, పానిపట్, రోహ్‌తక్, ఫతేహాబాద్ జిల్లాల నుండి ఒక్కొక్కరు ఉన్నారు. వీరిలో ఎక్కువమంది 25–40 ఏళ్ల మధ్య వయస్సు గలవారని అధికారులు తెలిపారు.
పోలీసుల సమాచారం ప్రకారం, ఈ వ్యక్తులు డంకీ రూట్ గా పిలవబడే అక్రమ మార్గం ద్వారా అమెరికాలోకి చొరబడ్డారు. ఈ మార్గం లాటిన్ అమెరికా దేశాల గుండా అమెరికా భూభాగానికి చేరే ప్రమాదకర రూట్‌గా ప్రసిద్ధి చెందింది. సరైన పత్రాలు లేకపోవడంతో అమెరికన్ ఇమ్మిగ్రేషన్ అధికారులు వారిని నిర్బంధించి స్వదేశానికి పంపారు.
దేశానికి చేరుకున్న వెంటనే ఢిల్లీ పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని ప్రాథమిక విచారణ జరిపారు. అనంతరం వారిని కుటుంబాలకు అప్పగించినట్లు కర్నాల్ డీఎస్పీ సందీప్ కుమార్ తెలిపారు. అక్రమ మార్గాల్లో విదేశాలకు వెళ్లడం చాలా ప్రమాదకరం. ఇలాంటి చర్యలు జీవితాంతం ఇబ్బందులకు దారి తీస్తాయి అని ఆయన హెచ్చరించారు.
కాలిఫోర్నియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తర్వాత అమెరికాలో ఇమ్మిగ్రేషన్ తనిఖీలు మరింత కఠినతరం అయ్యాయి. ఆ ప్రమాదానికి కారణమైన 21 ఏళ్ల జస్మన్‌ప్రీత్ సింగ్ కూడా అక్రమ వలసదారుడేనని అధికారులు తెలిపారు. అతను 2022లో డంకీ రూట్ ద్వారా అమెరికాలోకి ప్రవేశించినట్లు విచారణలో తేలింది.
ఉద్యోగాలు ఆర్థిక స్థిరత్వం కోసం విదేశాలకు వెళ్ళాలన్న కల యువతలో వేగంగా పెరుగుతోంది. కానీ చట్టబద్ధ మార్గాల బదులు అక్రమ మార్గాలను ఎంచుకుంటే ఫలితాలు దారుణంగా మారుతున్నాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల అమెరికా, కెనడా, యూరప్ దేశాలు ఇలాంటి అక్రమ వలసదారులపై చర్యలను మరింత కఠినతరం చేశాయి.