హైదరాబాద్‌లోని సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ వివాదంపై ఆసక్తికర మలుపులు చోటు చేసుకుంటున్నాయి. ఈ వ్యవహారంలో కేంద్రంగా నిలిచిన సెంటర్ యజమాని డా. నమ్రత తాజాగా మీడియాతో స్పందించారు. ఆమె తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ, తాను ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టంగా తెలిపారు. ఒక ఆర్మీ అధికారి తప్పుడు ఆరోపణల వల్లే ఈ పరిస్థితి ఎదురైందని ఆమె వాదించారు.
డా. నమ్రత మాట్లాడుతూ "నన్ను తప్పుగా చిత్రీకరిస్తున్నారు. ఇది న్యాయపరంగా కూడా సరైనది కాదు. నేను చేసినదేమీ తప్పు కాదు. నిజాలు త్వరలోనే బయటపెడతాను" అని వెల్లడించారు. తన పరువుకు భంగం కలిగేలా ఆరోపణలు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం పూర్తిగా దర్యాప్తులో ఉందని, తాను సహకరించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు.
ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న డాక్టర్ నమ్రతను సికింద్రాబాద్ సివిల్ కోర్టు 5 రోజుల పోలీస్ కస్టడీకి పంపింది. తాజాగా పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించేందుకు సిద్ధమయ్యారు. మీడియా ప్రశ్నలకు తలిపెట్టిన సందర్భంలో ఆమె పై వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది.
ఇప్పటికీ కేసు మిస్టరీగానే మిగిలిపోతుండటంతో, పూర్తి నిజాలు బయటకు రావాలంటే అధికారులు నిర్దిష్టమైన విచారణ చేయాల్సిన అవసరం ఉంది. ఈ కేసుకు సంబంధించి మరిన్ని విషయాలు అధికారికంగా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.