దేశవ్యాప్తంగా ఉన్న IIM (Indian Institute of Management) లలో MBA మరియు పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే CAT 2025 (Common Admission Test) రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 13, 2025 వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఈ పరీక్ష ద్వారా IIMలతో పాటు ఇతర ప్రముఖ బిజినెస్ స్కూళ్లలో కూడా అడ్మిషన్ పొందవచ్చు. మేనేజ్‌మెంట్ రంగంలో కెరీర్ కలలుగాంచే యువతకు ఇది కీలకమైన అవకాశం.
CAT-2025 దరఖాస్తు పూర్తిగా ఆన్‌లైన్ ద్వారా జరుగుతుంది. అభ్యర్థులు తమ వ్యక్తిగత వివరాలు, విద్యార్హతల వివరాలు, ఫోటో, సంతకం, ఇతర అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేసి అప్లికేషన్ పూర్తి చేయాలి. దరఖాస్తు ఫీజు జనరల్, OBC, EWS కేటగిరీలకు ₹2,600 కాగా, SC, ST, PWD అభ్యర్థులకు ₹1,300గా నిర్ణయించారు.
నవంబర్ 5, 2025 నుంచి అభ్యర్థులు అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్షను నవంబర్ 30న దేశవ్యాప్తంగా మూడు సెషన్లలో నిర్వహించనున్నారు – ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. పరీక్ష అనంతరం ఫలితాలను జనవరి 2026లో విడుదల చేయనున్నట్టు నిర్వాహకులు వెల్లడించారు.
CAT 2025ను ఈ సంవత్సరం IIM కలకత్తా నిర్వహిస్తోంది. పూర్తి సమాచారం కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ అయిన www.iimcat.ac.in ని సందర్శించాలి. మరిన్ని వివరాలు తెలుసుకుని, ముందుగానే సిద్ధం కావడం మంచిది.