స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన ప్లాటినం జూబ్లీ వేడుకల సందర్భంగా, పేద మరియు ప్రతిభావంతులైన విద్యార్థులకు పెద్ద శుభవార్త చెప్పింది. SBI ఫౌండేషన్ ద్వారా “ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్‌షిప్ 2025” ను ప్రకటించింది. ఈ స్కాలర్‌షిప్ కింద విద్యార్థులు సంవత్సరానికి గరిష్టంగా రూ.20 లక్షల వరకు ఆర్థిక సహాయం పొందవచ్చు. చివరి తేదీ 2025 నవంబర్ 15 లోగా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి.
ఈ స్కాలర్‌షిప్ కోసం 9-12 తరగతుల విద్యార్థులు, డిగ్రీ, పీజీ, ఐఐటీ, ఐఐఎం, వైద్య విద్యార్థులు అర్హులు. అలాగే విదేశాల్లో ఉన్నత విద్య చదవాలనుకునే వారు కూడా అప్లై చేసుకోవచ్చు. ముఖ్యంగా SC/ST విద్యార్థులకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. అయితే, గత విద్యా సంవత్సరంలో కనీసం 75% మార్కులు లేదా 7.0 CGPA సాధించి ఉండాలి.
అర్హతలో మరో షరతు ఏమిటంటే, పాఠశాల విద్యార్థుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.3 లక్షల లోపు ఉండాలి. కాలేజీ/యూనివర్సిటీ విద్యార్థుల కుటుంబ ఆదాయం రూ.6 లక్షలకు మించకూడదు. అలా చేస్తేనే ఈ స్కాలర్‌షిప్‌కి అర్హులు అవుతారు. ఇది నిజంగా ఆర్థికంగా బలహీనంగా ఉన్న ప్రతిభావంతులైన పిల్లలకు గొప్ప అవకాశం.
ఈ స్కాలర్‌షిప్ కింద విద్యార్థులు రూ.15,000 నుంచి గరిష్టంగా రూ.20 లక్షల వరకు ఆర్థిక సహాయం పొందవచ్చు. ఈ డబ్బుతో ట్యూషన్ ఫీజులు, స్టడీ మెటీరియల్స్, మరియు ఇతర విద్యా ఖర్చులు చెల్లించుకోవచ్చు. NIRF టాప్ 300లో ఉన్న కాలేజీలు, NAAC ‘A’ గ్రేడ్ ఉన్న యూనివర్సిటీలు, IITలు, IIMలు, మెడికల్ కాలేజీలు, అలాగే విదేశీ విశ్వవిద్యాలయాల్లో చదివే వారికి కూడా ఇది వర్తిస్తుంది.
SBI చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి మాట్లాడుతూ, ఈ స్కాలర్‌షిప్ వెనుక ఉద్దేశం ప్రతిభావంతులైన కానీ పేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల కలలను నెరవేర్చడం అని తెలిపారు. 2047 నాటికి “వికసిత భారత్” లక్ష్యానికి విద్యార్థులు సహకరించేలా చేయడమే ఈ ప్రాజెక్ట్ అని ఆయన అన్నారు. ఇందుకోసం SBI ఏకంగా రూ.90 కోట్ల బడ్జెట్ కేటాయించింది. విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్ కోసం తప్పకుండా sbiashascholarship.co.in వెబ్‌సైట్ ద్వారా చివరి తేదీకి ముందే అప్లై చేయాలి.