భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ డీఆర్‌డీవో తన అస్త్రాగారంలో మరో శక్తివంతమైన ఆయుధాన్ని చేర్చింది. దేశ రక్షణ శక్తిని మరింత బలపరిచే దిశగా, శనివారం ఒడిశా తీరంలో ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ (IADWS) తొలి ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. ఈ విషయాన్ని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఈ చారిత్రాత్మక విజయంపై డీఆర్‌డీవో శాస్త్రవేత్తలు, భారత సైన్యం, పరిశ్రమల ప్రతినిధులను ఆయన అభినందించారు.
రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ– “ఈ ప్రత్యేకమైన ప్రయోగం భారతదేశం బహుళస్థాయి గగనతల రక్షణ సామర్థ్యాన్ని రుజువు చేసింది. దేశంలోని కీలక ప్రాంతాలు, ముఖ్య సంస్థలను శత్రువుల వైమానిక దాడుల నుంచి రక్షించేందుకు ఇది మరింత పటిష్ఠమైన కవచం అవుతుంది” అన్నారు.
IADWS పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేయబడిన బహుళస్థాయి రక్షణ వ్యవస్థ. ఇందులో క్విక్ రియాక్షన్ సర్ఫేస్-టు-ఎయిర్ మిసైల్ (QRSAM), అడ్వాన్స్‌డ్ వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ (VSHORADS), లేజర్ ఆధారిత డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ (DEW) ఉన్నాయి. ఇవన్నీ కలసి భారత గగనతలానికి అభేద్యమైన రక్షణ కవచంగా నిలుస్తాయని రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు.