ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం నుంచి శుభవార్త లభించింది. ఉమ్మడి కృష్ణా జిల్లా కంకిపాడు–గుడివాడ మధ్య 27 కిలోమీటర్ల నాలుగు లైన్ల గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణానికి కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీని కలిసి అభ్యర్థించగా, ప్రధాని గతిశక్తి పథకం కింద రూ.600 కోట్ల ఆర్థిక మంజూరు కుదిరింది.
ఈ హైవే విజయవాడ నుంచి గుడివాడ వెళ్లే ప్రయాణికులకు ఎంతో ప్రయోజనకరంగా ఉండనుంది. గడ్కరీకి నివేదిక అందజేసిన వెంటనే ఆయన అనుకూలత వ్యక్తం చేశారు. అంతేకాదు, మచిలీపట్నం పోర్టు నుంచి జాతీయ రహదారి NH-65 వరకు 6 లైన్ల గ్రీన్‌ఫీల్డ్ రహదారి నిర్మాణ ప్రతిపాదనపై కూడా గడ్కరీ సానుకూలంగా స్పందించారు. రూ.350 కోట్లకు సంబంధించిన ప్రతిపాదనల కోసం అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
ఈ రహదారిలో 7 అండర్‌పాస్‌లు, 4 పైవంతెనలు ఉండనున్నాయి. పోర్టుకు సరకు రవాణా కోసం ఇది కీలకమని ఎంపీ తెలిపారు. గుడివాడ పరిధిలోని రహదారుల అభివృద్ధికి సంబంధించి కూడా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. NH-216హెచ్ విస్తరణకు రూ.18.50 కోట్లు, NH-165 మరియు NH-216హెచ్ అనుసంధానానికి రూ.28.53 కోట్ల ప్రతిపాదనలు కేంద్రానికి సమర్పించారు.
అదే విధంగా మచిలీపట్నం–మంగినపూడి బీచ్ మధ్య 11.07 కిలోమీటర్ల రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించేందుకు కూడా విజ్ఞప్తి చేయగా, గడ్కరీ సానుకూలంగా స్పందించారు. అన్ని ప్రతిపాదనలపై కేంద్రం సానుకూలంగా స్పందించడంతో నిధుల విడుదలపై త్వరలోనే స్పష్టత రావొచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన ఎంపీ బాలశౌరి, అభివృద్ధి పనులకు వేగం తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.