అనంతపురం రాయలసీమ గుండె చప్పుడు. ఎండ, కరవు, వలసలు – ఇవే ఇక్కడి ప్రజలకు మామూలైన కష్టాలు. కానీ ఈ నేల కేవలం ఇబ్బందులకే కాదు, సాహసానికి, త్యాగానికి, కష్టానికి నిలయమని నిరూపిస్తోంది. ఈ నేలపై సూపర్ సిక్స్ విజయోత్సవ సభను ఉద్దేశించి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రజలతో మనసు విప్పారు.
“రాయలసీమకు ఎప్పుడూ ఒకటే సీజన్ – కరవు సీజన్” అంటూ పవన్ కల్యాణ్ మొదలుపెట్టిన మాటలు సభలోని ప్రజల హృదయాలను తాకాయి. దశాబ్దాలుగా ఎండ, నీటి కొరత, ఉపాధి లేమితో పోరాడుతున్న ప్రజల కష్టాలను గుర్తు చేశారు.
పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, పార్టీలు వేర్వేరు అయినా ప్రజల శ్రేయస్సు కోసం ఒకటై పనిచేయాలనే సంకల్పంతో కూటమి ఏర్పడిందని చెప్పారు. సూపర్ సిక్స్ హామీలతో ప్రజల నమ్మకాన్ని గెలుచుకుని, చరిత్రాత్మక విజయాన్ని సాధించామని గుర్తుచేశారు. “పార్టీలు వేరైనా, ప్రజా శ్రేయస్సే లక్ష్యం” అన్న ఆయన మాటలకు సభలో చప్పట్ల వర్షం కురిసింది.
ప్రజల ఆరోగ్యమే నిజమైన సంపద అని చెబుతూ, రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య భీమా అందించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వివరించారు. ఈ పథకం ద్వారా పేద, మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర వ్యాధుల కారణంగా ఆర్థికంగా కూలిపోకుండా రక్షించబడతాయని తెలిపారు.
అభివృద్ధి పథంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా:
4 వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించామన్నారు.
పీఎం జన్ మన్ పథకం కింద 1005 కోట్ల రూపాయలతో 625 గిరిజన గ్రామాలను రోడ్ల ద్వారా అనుసంధానిస్తున్నామని వివరించారు. ఇకపై ఏజెన్సీ ప్రాంతాల్లో డోలీ మోతలు ఉండవని, ఆధునిక రహదారులు గిరిజన ప్రాంతాలను కొత్త దిశగా తీసుకెళ్తాయని హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో పచ్చదనం పెంచేందుకు పెద్ద ఎత్తున కోటి మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించామని పవన్ కల్యాణ్ వెల్లడించారు. పచ్చదనం పెరిగితే వాతావరణం చల్లబడుతుందని, భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన పర్యావరణం అందిస్తామని చెప్పారు. రాయలసీమ యువతకు ఎప్పుడూ వలసలే దారి అయిందని గుర్తు చేస్తూ, ఇకపై పరిస్థితులు మారతాయని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. విద్య, ఉపాధి అవకాశాలను పెంచుతున్నామని, పొరుగు రాష్ట్రాలకు వెళ్లకుండా ఇక్కడే ఉద్యోగాలు, ఉపాధి కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు.
పవన్ కల్యాణ్ తన ప్రసంగంలో, “ప్రజా ప్రయోజనాల కోసం ఐక్యంగా కూటమి పార్టీలు కలిసి కొనసాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సూపర్ సిక్స్ అమలు చేస్తాం” అని గట్టిగా హామీ ఇచ్చారు. ప్రజలకు వాగ్దానం చేసిన ప్రతి అంశం నిజమయ్యేలా కృషి చేస్తామని నమ్మకం కలిగించారు.
అనంతపురంలో జరిగిన ఈ విజయోత్సవ సభ కేవలం ఒక రాజకీయ సమావేశం కాదు, ప్రజలతో చేసిన నేరుగా సంభాషణ. పవన్ కల్యాణ్ మాటల్లో రాయలసీమ బాధల అర్థం, ఆశల జాడ కనిపించింది. అభివృద్ధి, ఆరోగ్యం, ఉపాధి, పచ్చదనం – ఇవన్నీ కలిసొచ్చే రతనాల సీమగా రాయలసీమ మారుతుందని పవన్ కల్యాణ్ నమ్మకం వ్యక్తం చేశారు.