శాకాహారులు ఎక్కువగా ప్రత్యేక వంటకాల కోసం పనీర్ లేదా మష్రూమ్ వాడుతుంటారు. కానీ, వీటికి బదులుగా రుచికరమైన, ఆరోగ్యకరమైన మరో ఆప్షన్ కూడా ఉంది. అదే మఖానా-మటర్ (పచ్చి బఠాణి) కూర. ఇది కాల్షియం, ప్రోటీన్, ఫైబర్, మినరల్స్ వంటి పోషకాలు కలిగి ఉంటుంది. దీంతో భోజనం రుచికరంగా, ఆరోగ్యకరంగా ఉంటుంది.
కొత్త రుచులు ప్రయత్నించాలని అనుకునే వారికి ఈ మఖానా-మటర్ కూర మంచి ఆప్షన్. మఖానా క్రంచీగా ఉండి పోషకాలు ఇస్తుంది, మటర్‌లో విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. ఇవి కలిపి చేసిన ఈ కూర రుచికరంగానే కాక ఆరోగ్యకరంగానూ ఉంటుంది.
తయారీకి కావలసిన పదార్థాలు: ఒక కప్పు మఖానా, ఒక కప్పు మటర్, రెండు ఉల్లిపాయలు (చిన్న ముక్కలుగా), రెండు టేబుల్ స్పూన్లు టమోటా ప్యూరీ, ఒక పచ్చిమిర్చి, ఒక టీ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్, అర కప్పు పెరుగు లేదా క్రీమ్, రెండు స్పూన్లు నూనె/నెయ్యి, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు. కొత్తిమీర గార్నిష్‌కి తప్పనిసరిగా వాడాలి.
తయారు చేసే విధానం: ముందుగా పాన్‌లో నెయ్యి వేసి మఖానాను బంగారు రంగులో వేయించి పక్కన పెట్టాలి. తర్వాత అదే పాన్‌లో నూనె వేసి జీలకర్ర వేయాలి. ఉల్లిపాయలు వేసి వేయించి, అల్లం-వెల్లుల్లి పేస్ట్ కలపాలి. ఇప్పుడు టమోటా ప్యూరీ, మసాలా పొడులు వేసి నూనె వేరుపడే వరకు వండాలి. మటర్ వేసి కొంచెం నీళ్లు కలిపి 5 నిమిషాలు ఉడికించాలి. ఆ తర్వాత వేయించిన మఖానా, పెరుగు/క్రీమ్ వేసి 2-3 నిమిషాలు మెల్లిగా వండాలి.
చివరగా గరం మసాలా, కొత్తిమీర వేసి స్టౌ ఆఫ్ చేయాలి. రొట్టె లేదా అన్నంతో ఈ మఖానా-మటర్ కూర తింటే చాలా రుచిగా ఉంటుంది. అతిథులకు వడ్డించినా అందరూ మీ వంటను మెచ్చుకుంటారు.