పొడవైన, మెరిసే మరియు మందపాటి జుట్టు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? ముఖ్యంగా మహిళలకు ఇది ఒక అందాల కల. కానీ, ఈ రోజుల్లో మనం ఎదుర్కొంటున్న కాలుష్యం, సరైన ఆహారం తీసుకోకపోవడం, విపరీతమైన ఒత్తిడి కారణంగా జుట్టు రాలడం, విరిగిపోవడం, చుండ్రు వంటి సమస్యలు విపరీతంగా పెరిగిపోయాయి. ఎన్ని ఖరీదైన షాంపూలు, కండీషనర్లు వాడినా... జుట్టు ఆరోగ్యం మళ్లీ మొదటికి రావడం లేదు.
ఇలాంటి పరిస్థితుల్లో, మన పూర్వీకుల కాలం నాటి జుట్టు సంరక్షణ పద్ధతులు, ముఖ్యంగా నూనెల ప్రాముఖ్యత మళ్లీ ముందుకు వచ్చింది. నిజం చెప్పాలంటే, నూనెలు మన జుట్టుకు కేవలం పోషణ మాత్రమే కాదు, ఇది మన నెత్తిమీద రక్త ప్రసరణను మెరుగుపరచి, జుట్టు మూలాలను బలంగా ఉంచి, సహజ పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. నిపుణులు సైతం ఆరోగ్యకరమైన జుట్టుకు రహస్యం నూనెలోనే ఉంది అని గట్టిగా చెబుతున్నారు.
జుట్టు సమస్యలకు.. ఏ నూనె దివ్యౌషధం?
ప్రతి నూనెకు ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది. మీ జుట్టు సమస్యను బట్టి సరైన నూనెను ఎంచుకోవడం చాలా ముఖ్యం.
కొబ్బరి నూనె (Coconut Oil): విరిగిపోకుండా రక్షణ…
మన ఇళ్లలో ఎక్కువగా ఉపయోగించేది కొబ్బరి నూనె. దీనికి ఉన్నంత పోషణ మరే నూనెకూ ఉండదంటే అతిశయోక్తి కాదు. ఇది జుట్టును మృదువుగా, మెరిసేలా ఉంచడమే కాకుండా, లోతుగా పోషణనిచ్చి, జుట్టు విరిగిపోకుండా కాపాడుతుంది. అందుకే హెయిర్ ఆయిల్స్ అంటే మొదట గుర్తొచ్చేది ఇదే.
బాదం నూనె (Almond Oil): సహజ మెరుపు కోసం…
బాదం నూనె చాలా తేలికగా ఉంటుంది, కాబట్టి రోజువారీ ఉపయోగానికి ఇది చాలా అనువుగా ఉంటుంది. ఇందులో మెగ్నీషియం, విటమిన్ ఇ, ఒమేగా ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టుకు సహజ మెరుపు ఇచ్చి, చివర్లు చిట్లడాన్ని, విచ్ఛిన్నాన్ని తగ్గిస్తాయి.
కాస్టర్ ఆయిల్ (Castor Oil): జుట్టు రాలడానికి చెక్!
మీకు జుట్టు ఎక్కువగా రాలిపోతుంటే, కాస్టర్ ఆయిల్ (ఆముదం) అద్భుత ఫలితాలను ఇస్తుంది. ఇందులో ఉండే రిసినోలెయిక్ ఆమ్లం నెత్తిమీద రక్త ప్రసరణను పెంచుతుంది. దీంతో జుట్టు మూలాలు బలంగా మారతాయి. ఫలితంగా జుట్టు చిక్కగా, దృడంగా పెరుగుతుంది.
ఆర్గాన్ ఆయిల్ (Argan Oil): లిక్విడ్ గోల్డ్..
దీన్నే చాలామంది లిక్విడ్ గోల్డ్ (Liquid Gold) అని పిలుస్తారు. విటమిన్ ఇ మరియు శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉండే ఈ నూనె.. జుట్టు ఫ్రిజ్‌ను (చిక్కుపడటాన్ని) తగ్గిస్తుంది. జుట్టుకు అద్భుతమైన మెరుపును తిరిగి ఇస్తుంది. పొడిబారిన జుట్టుకు ఇది మంచి మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది.
ఆలివ్ నూనె (Olive Oil): చుండ్రుకు చెక్!
ఆలివ్ నూనె జుట్టు ఆరోగ్యానికి ఒక వరప్రసాదం అనే చెప్పాలి. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు నెత్తిమీద తేమను పెంచి, చుండ్రు, పొడిబారడాన్ని తగ్గిస్తాయి. ఇది జుట్టును రూట్ నుండి కొనదాకా బలపరుస్తుంది.
మరికొన్ని అద్భుతమైన నూనెలు:
జోజోబా నూనె (Jojoba Oil): తేమ సమతుల్యం..
జోజోబా నూనె చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే, ఇది మన నెత్తిమీద సహజంగా ఉత్పత్తి అయ్యే సెబమ్ లాంటి లక్షణాలతో ఉంటుంది. దీంతో నెత్తిమీద తేమను సమతుల్యం చేసి, కుదుళ్లను తెరిచి, కొత్త జుట్టు పెరుగుదలకు మార్గాన్ని సుగమం చేస్తుంది.
ఉసిరి నూనె (Amla Oil): తెల్ల జుట్టు తగ్గడానికి..
భారతీయ ఉసిరి నుంచి తీసే ఉసిరి నూనెలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇది కేశరంద్రాలను బలపరచి, ముఖ్యంగా అకాల తెల్ల జుట్టును తగ్గిస్తుంది. జుట్టు వాల్యూమ్ (సాంద్రత) పెరగడానికి బాగా దోహదం చేస్తుంది.
రోజ్మేరీ ఆయిల్ (Rosemary Oil): పెరుగుదలకు ఊతం..
రోజ్మేరీ ఆయిల్ నెత్తిమీద రక్త ప్రసరణను పెంచి, కొత్త జుట్టు పెరుగుదలకు ఊతమిస్తుంది. సన్నబడే జుట్టు సమస్యతో బాధపడే వారికి ఇది బలహీనమైన వెంట్రుకలకు బలం చేకూర్చి, జుట్టు గట్టిగా పెరిగేలా చేస్తుంది.

మీరు కూడా మీ జుట్టు సమస్యను బట్టి ఈ నూనెలను సరైన రీతిలో వాడటం ప్రారంభిస్తే.. ఆధునిక హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ కంటే సహజ నూనెలనే మీ జుట్టుకు నిజమైన రక్షకులుగా నిలుస్తాయి. ఆరోగ్యకరమైన, పొడవైన, మెరిసే జుట్టును పొందడం మీకూ సాధ్యమే..
గమనిక: ఈ కథనం నిపుణులు అందించిన సాధారణ సమాచారం ఆధారంగా రాసినది. దీనిని 'ఆంధ్రప్రవాసి' తెలుగు ధృవీకరించడం లేదు.