భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) దేశంలో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను మరింత విస్తృతం చేయడానికి మరో ముందడుగు వేసింది. ఇంటర్నెట్ లేకున్నా కూడా చెల్లింపులు చేయగల “CBDC ఆఫ్‌లైన్ పేమెంట్ సిస్టమ్”ను ఆవిష్కరించింది. ఇప్పటి వరకు డిజిటల్ ట్రాన్సాక్షన్లకు ఇంటర్నెట్ తప్పనిసరి కాగా, ఇకపై వినియోగదారులు నెట్ కనెక్షన్ లేకపోయినా సరుకులు కొనుగోలు చేసి సులభంగా డిజిటల్ చెల్లింపులు చేయగలరు.
ఈ సరికొత్త పద్ధతిలో వినియోగదారులు తమ మొబైల్ ఫోన్ లేదా పరికరాన్ని ఉపయోగించి QR కోడ్ లేదా ట్యాప్ ఫీచర్ ద్వారా చెల్లింపులు చేయవచ్చు. దీనికి ఇంటర్నెట్ లేదా టెలికాం కనెక్టివిటీ అవసరం ఉండదు. ఈ లావాదేవీలు నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (NFC) లేదా ఇతర సురక్షిత సామీప్య సాంకేతికతల ద్వారా రెండు డిజిటల్ వాలెట్ల మధ్య నేరుగా జరుగుతాయి. అంటే, నెట్‌వర్క్ లేకున్నా ఒక వాలెట్ నుంచి మరొకదానికి డబ్బు బదిలీ అవుతుంది.
భారత రిజర్వ్ బ్యాంక్ ఈ వ్యవస్థను ముంబైలో జరిగిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ (GFF) 2025లో అధికారికంగా ప్రారంభించింది. ఇది భారతదేశ డిజిటల్ కరెన్సీ ప్రయాణంలో ఒక చారిత్రాత్మక మైలురాయిగా భావిస్తున్నారు. ప్రపంచంలో ఆఫ్‌లైన్ డిజిటల్ రూపాయి సిస్టమ్‌ను ప్రవేశపెట్టిన కొద్ది దేశాలలో భారత్ ఒకటిగా నిలిచింది.
ఈ ఆఫ్‌లైన్ డిజిటల్ రూపాయి, భౌతిక నగదు లాగా పనిచేసే డిజిటల్ కరెన్సీగా వ్యవహరిస్తుంది. ఇది యూపీఐ (UPI) వలె కాకుండా, కేంద్ర బ్యాంక్ నేరుగా మద్దతు ఇచ్చే సురక్షిత లావాదేవీ విధానం. దీని వల్ల దూరప్రాంతాల్లో, నెట్‌వర్క్ లేని గ్రామీణ ప్రాంతాల్లో కూడా డిజిటల్ పేమెంట్స్ సజావుగా జరిగే అవకాశం ఉంటుంది.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ కొత్త వ్యవస్థ దేశంలో డిజిటల్ ఆర్థిక వ్యవస్థను మరింత విస్తరించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రజలు నగదు లావాదేవీలపై ఆధారపడే పరిస్థితి తగ్గిపోతుంది. చిన్న వ్యాపారులు, గ్రామీణ ప్రాంతాల వినియోగదారులు కూడా సులభంగా డిజిటల్ పేమెంట్స్ చేయగలుగుతారు. దీంతో “డిజిటల్ ఇండియా” లక్ష్యానికి RBI మరో అడుగు ముందుకు వేసింది.