ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత ప్రజల కల ఎట్టకేలకు నెరవేరబోతోంది… విజయవాడలోని గన్నవరం విమానాశ్రయం నుంచి సింగపూర్కు అంతర్జాతీయ విమాన సర్వీసు మళ్లీ ప్రారంభం కానుంది. ఈ శుభవార్తను పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు శనివారం ప్రకటించారు.
నవంబర్ 15 నుంచి ఈ ఇండిగో ఎయిర్‌లైన్స్ సర్వీసు మళ్లీ అందుబాటులోకి రానుంది. ఈ విమానం ప్రతి మంగళ, గురు, శనివారాల్లో విజయవాడ నుంచి సింగపూర్‌లోని చాంగి విమానాశ్రయానికి రాకపోకలు సాగిస్తుంది. దీంతో ఏపీ రాజధాని ప్రాంతానికి ప్రపంచ దేశాలతో మరింత బలమైన అనుసంధానం ఏర్పడుతుందని మంత్రి వెల్లడించారు.
విజయవాడ నుంచి సింగపూర్‌కు విమాన సర్వీసులు నడవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో టీడీపీ ప్రభుత్వం హయాంలో ఈ సర్వీసు ప్రారంభమైంది, కానీ ఆ తర్వాత అర్ధాంతరంగా నిలిచిపోయింది. 2018 డిసెంబరు నుంచి 2019 జూన్ వరకూ ఈ ఇండిగో సర్వీసులు నడిచాయి. అప్పట్లో ఈ విమానాలకు 80 శాతానికి పైగా ఆక్యుపెన్సీ ఉండేది. అంటే, ప్రజల నుంచి ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.
వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే, ఈ అంతర్జాతీయ సర్వీసును అర్ధంతరంగా ఆపేసింది. దీన్ని కొనసాగించాలని అన్ని వర్గాల నుంచి విజ్ఞప్తులు వచ్చినా, అప్పటి ప్రభుత్వం వాటిని పెడచెవిన పెట్టింది. టీడీపీ ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలపై కక్షగట్టినట్టుగా అంతర్జాతీయ సర్వీసులను ఆపేయడం వల్ల, ఆ భవనం, సౌకర్యాలు ఐదేళ్లు నిరుపయోగంగా ఉండిపోయాయని స్థానికులు విమర్శిస్తున్నారు.
ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రజల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ సింగపూర్ సర్వీసును పునఃప్రారంభిస్తున్నారు. ఈ అంతర్జాతీయ సర్వీసు కోసం మచిలీపట్నం ఎంపీ, విమానాశ్రయ అభివృద్ధి కమిటీ ఛైర్మన్ వల్లభనేని బాలశౌరి కూడా తీవ్రంగా ప్రయత్నించారు.
2018లో కూడా టీడీపీ ప్రభుత్వం వయబులిటీ గ్యాప్ ఫండింగ్ (VGF) పద్ధతిలో ఇండిగోతో ఒప్పందం చేసుకుని సర్వీసులు నడిపింది. విజయవాడ నుంచి సింగపూర్‌కు వెళ్తే, అక్కడి నుంచి ఏ దేశానికైనా సులభంగా చేరుకునే కనెక్టివిటీ ఏర్పడుతుందనేది ఈ ప్రయత్నం వెనుక ప్రధాన భావన.
విజయవాడ విమానాశ్రయంలో అంతర్జాతీయ సర్వీసులను నడిపేందుకు సరైన వసతులు లేకపోవడంతో, అప్పటి టీడీపీ ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI)తో మాట్లాడి, రూ. 4 కోట్ల వరకూ ఖర్చు చేసి పాత టెర్మినల్‌ను అంతర్జాతీయ సౌకర్యాలతో నెలల వ్యవధిలోనే సిద్ధం చేసింది.
ఇందులో కస్టమ్స్, ఇమ్మిగ్రేషన్ విభాగాలు, ఏపీ పోలీసులు, విదేశీ కరెన్సీ మార్చుకునే బ్యాంకు శాఖలు నెలకొల్పారు. అంతేకాకుండా, అత్యాధునిక భద్రతా వ్యవస్థ మరియు సౌకర్యాలను ఏర్పాటు చేశారు. మొత్తం మీద, ఈ అంతర్జాతీయ విమాన సర్వీస్ పునఃప్రారంభం అనేది రాష్ట్ర అభివృద్ధికి, ముఖ్యంగా వ్యాపార, ఐటీ రంగానికి కొత్త ఊపునిస్తుందని చెప్పవచ్చు. విదేశాల్లో ఉంటున్న ఆంధ్ర ప్రజలు కూడా తమ సొంత ప్రాంతానికి సులభంగా చేరుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.