ఇప్పటి రోజుల్లో ఆర్థిక ఇబ్బందులు, ఖర్చుల భారంతో చాలామంది కొత్త వాహనం కొనలేకపోతున్నారు. ముఖ్యంగా పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారు ఎక్కువగా సెకండ్ హ్యాండ్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. కొత్త వాహనాల ధరలు అధికంగా ఉండటంతో పాత వాహనాలు తక్కువ ధరకే లభించడం వీటిపై డిమాండ్ పెరగడానికి కారణమవుతోంది. అయితే, ఇలాంటి వాహనాలను సరిగా పరిశీలించకుండా కొనుగోలు చేస్తే తర్వాత పెద్ద సమస్యల్లో చిక్కుకోవాల్సి వస్తుందని పోలీసులు, రవాణాశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఉదాహరణకు, ఇటీవల ఒక వ్యక్తి సెకండ్ హ్యాండ్ స్కూటీ కొనుగోలు చేశాడు. అది సరిగా పనిచేయకపోవడంతో వెంటనే మరొకరికి అమ్మేశాడు. కానీ ఆ స్కూటీకి సంబంధించిన RC (రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్) తన పేరు మీదకే ఉండడంతో, తర్వాత ఆ వాహనం మూడో వ్యక్తి వద్దకు వెళ్లింది. ఆ వ్యక్తి ప్రమాదానికి గురయ్యాడు. కేసు మాత్రం మొదట వాహనం కొన్న వ్యక్తిపైనే నమోదైంది. ఇదే విధంగా మరో ఘటనలో, ఒక వ్యక్తి సెకండ్ హ్యాండ్ బైక్ కొనుగోలు చేసి, ఇన్సూరెన్స్ చేయించకుండా, RCను తన పేరుపైకి మార్చకుండా వాడుతుండగా ప్రమాదం జరిగింది. ఫలితంగా ఆ కేసు తీవ్రత పెరిగి ఇబ్బందులు తలెత్తాయి. ఇలాంటి ఉదాహరణలు చాలానే ఉన్నాయి.
ప్రస్తుతం పండగల సీజన్ నడుస్తోంది. దసరా, దీపావళి సందర్భంగా చాలామంది సెకండ్ హ్యాండ్ వాహనాలను కొనుగోలు చేస్తుంటారు. ఇలాంటి సమయంలో మోసపోకుండా జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. వాహనం కొనుగోలు చేసే ముందు దానికి సంబంధించిన అన్ని రికార్డులను సరిచూసుకోవాలి. RC, ఇన్సూరెన్స్, పన్నులు, పెండింగ్ జరిమానాలు అన్నీ సక్రమంగా ఉన్నాయా లేదా అనేది ధృవీకరించాలి. ముఖ్యంగా చాసిస్ నంబర్, ఇంజిన్ నంబర్ పత్రాలలో ఉన్న వాటితో సరిపోతున్నాయా అనేది తప్పనిసరిగా చూడాలి. వాహనం పై అప్పులు లేదా బకాయి EMIలు ఉన్నాయా అనేది ఫైనాన్స్ క్లియరెన్స్ ద్వారా నిర్ధారించుకోవాలి.
వాహనాన్ని అధికారికంగా మీ పేరు మీదకు మార్చుకోవడం అత్యంత ముఖ్యం. వాహనాన్ని స్వయంగా నడిపి టెస్ట్ డ్రైవ్ చేయడం, ఈ సమయంలో తెలిసిన మెకానిక్‌ను వెంట తీసుకెళ్లడం మంచిది. వాహనంపై ఎలాంటి కేసులు లేకపోవడం, పోలీసు ధ్రువీకరణ పత్రాలు సక్రమంగా ఉండటం కూడా చాలా అవసరం. రికార్డులు లేదా బీమా పత్రాలు సరిగా లేని వాహనాలను ఎట్టి పరిస్థితుల్లోనూ కొనరాదు. మొత్తానికి, సెకండ్ హ్యాండ్ వాహనం కొనుగోలు చేయాలనుకునే వారు ముందుగా పత్రాలను సరిచూసుకుని, చట్టబద్ధంగా RC ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. అలా చేస్తే భవిష్యత్తులో అనవసర ఇబ్బందులు, కేసులు తప్పించుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు.