కృత్రిమ మేధస్సు (Artificial Intelligence) ప్రపంచాన్ని మార్చేస్తుంది. పనులు వేగంగా జరుగుతున్నాయి, జ్ఞానం క్షణాల్లో అందుతోంది నిర్ణయాలు డేటాపై ఆధారపడి వస్తున్నాయి. కానీ ఈ సాంకేతిక అద్భుతానికి మానవ స్పర్శ, నైతికత, బాధ్యత అనే గుణాలు లేవు ఇదే నేటి పెద్ద సవాలు.
చాట్ జీపీటీ, జెమినీ, గ్రోక్ వంటి ఏఐ టూల్స్ మన జీవితంలో భాగమవుతున్నా వాటిని ఉపయోగించే సమయంలో జాగ్రత్తలు తప్పనిసరి. నిపుణులు చెబుతున్నట్లు మన భద్రత, గోప్యత, ఆర్థిక రక్షణ కోసం ఈ ఐదు విషయాలను ఎప్పుడూ ఏఐతో పంచుకోవద్దు.
ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు వైద్యుల జాగ్రత్త పరిశీలనతోనే పరిష్కారం అవుతాయి. సైకాలజిస్టులు రోగి స్వరాన్ని, ముఖ కవళికలను గమనించి సహాయం చేస్తారు. కానీ ఏఐకి ఆ మానవ సమర్థత ఉండదు.
మీ పేర్లు, చిరునామా, పాస్‌వర్డ్‌లు, బ్యాంక్ వివరాలు వంటి వ్యక్తిగత డేటాను ఏఐ చాట్లలో ఎప్పుడూ ఇవ్వొద్దు. కంపెనీలు తమ మోడళ్లను మెరుగుపరచడానికి చాట్లను నిల్వ చేస్తాయి. గతంలో చాట్‌జీపీటీ బగ్ కారణంగా ఇతరుల చాట్ హిస్టరీలు బయటపడ్డ సంఘటనలు జరిగాయి. కాబట్టి గోప్యతే భద్రత అనే నియమం ఎప్పుడూ గుర్తు పెట్టుకోవాలి.
ఏఐ ఇచ్చే ఫైనాన్షియల్ సలహాలు గణాంకాల ఆధారమే అది భవిష్యత్తు ఊహించదు. స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్‌పై ఏఐ చెప్పినట్లు పెట్టుబడి పెడితే నష్టాలు తప్పవు. మన రిస్క్ సామర్థ్యం, ఆదాయ పరిస్థితి తెలుసుకునే ఫైనాన్షియల్ అడ్వైజర్‌కి మాత్రమే ఆ సామర్థ్యం ఉంటుంది. ఏఐ మాత్రం అనుభవం లేని అనాలిస్ట్‌లా పనిచేస్తుంది.
చట్టాలూ న్యాయపరమైన అంశాలూ సంక్లిష్టమైనవి. ఇటీవల ఢిల్లీ హైకోర్టు ఒక కేసులో — ఏఐ తయారు చేసిన కల్పిత కేస్ స్టడీ కారణంగా న్యాయవాది ఇబ్బందులు పడ్డాడు. వీలునామా తయారీ వంటి సున్నితమైన అంశాల్లో ఏఐని ఉపయోగించడం న్యాయపరమైన ప్రమాదాలకు దారి తీస్తుంది.ఏఐ చెప్పిన మాటలకు మనమే బాధ్యత వహించాల్సి వస్తుంది ఇది మరవకూడదు.
ఏఐ మన సౌకర్యం కోసం కానీ మనకు బదులు కాదు. దాన్ని సరిగ్గా వాడితే మార్గదర్శి అవుతుంది తప్పుగా వాడితే ముప్పుగా మారుతుంది. సాంకేతికత ఎంత వేగంగా ముందుకు దూసుకెళ్లినా మానవ వివేకం, నైతికత, అనుభవం ఎప్పటికీ ప్రత్యామ్నాయం కావు.కాబట్టి... ఏఐను నమ్మండి, కానీ మితంగా, జాగ్రత్తగా.