తెలంగాణలో రాబోయే ఆగస్టు 4 రాజకీయంగా కీలకమైన రోజుగా మారబోతోందని విశ్లేషకులు చెబుతున్నారు. కారణం కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్‌పై గతంలో నుంచే కాంగ్రెస్, బీజేపీ పార్టీలు బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి.
అక్రమాలు, అవినీతి, నిర్మాణ లోపాలు చోటుచేసుకున్నాయని ఆరోపణలు చేస్తూ వచ్చాయి. ఇప్పటికే 2023లో మేడిగడ్డ బ్యారేజీ స్తంభాలు కూలిపోవడం, అన్నారం, సుందిళ్ల వద్ద సీపేజ్ సమస్యలు రావడం ఈ ఆరోపణలకు బలం చేకూర్చింది.
ఈ నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 2024 మార్చి 14న రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి పినాకి చంద్ర ఘోష్ నేతృత్వంలో ఏక సభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసింది. 15 నెలల పాటు సాగిన దర్యాప్తులో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్‌తో సహా 115 మంది సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేశారు. ఫలితంగా, మూడు వాల్యూమ్‌లలో, 650 పేజీల నివేదిక సిద్ధమైంది.
ఈ నివేదికను జూలై 31న జడ్జి పీసీ ఘోష్, నీటిపారుదల శాఖ ప్రధాన కార్యదర్శి రాహుల్ బొజ్జాకు అందజేయగా, ఆగస్టు 1న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డికి అందించారు. ఇక ఈ నివేదిక సారాంశాన్ని ఆగస్టు 4న కేబినెట్ సమావేశంలో అధికారికంగా ప్రదర్శించనున్నారు.
ఈ సమావేశం అనంతరం, కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశముందని, అలాగే అవినీతి ఆరోపణలపై ED, ACB విచారణలు జరగొచ్చని రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే, బీఆర్ఎస్ నేతలు మాత్రం "కాళేశ్వరం నిర్మాణంలో ఎటువంటి అవకతవకలు జరగలేదని" స్పష్టం చేస్తున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రత్యేకత ఏమిటంటే— ఇది తెలంగాణ ఏర్పడిన తర్వాత చేపట్టిన అతి పెద్ద ప్రాజెక్టు. గోదావరి నదిపై, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్ మండలంలోని కన్నేపల్లి వద్ద నిర్మించిన ఈ ప్రాజెక్టు, 45 లక్షల ఎకరాలకు ఆయకట్టు కల్పించేలా రూపొందించబడింది. సుమారు 235 టీఎంసీల నీటిని ఎత్తిపోసే లక్ష్యంతో దీన్ని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు రీ-డిజైన్ చేశారు.
ఇప్పుడు ఈ నివేదిక వెలుగులోకి రావడంతో, ఆగస్టు 4న తెలంగాణ రాజకీయాల్లో అసలు భూకంపం సంభవించనుందన్న అంచనాలు మరింత బలపడుతున్నాయి.