బాలకృష్ణ (Balakrishna) హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన 'భగవంత్ కేసరి' చిత్రానికి జాతీయ ఉత్తమ చిత్రం(తెలుగు) అవార్డు దక్కిన విషయం తెలిసిందే. అవార్డు రావడంపై ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఆనందం వ్యక్తం చేశారు. 'ఎక్స్' వేదికగా చిత్రబృందానికి శుభాకాంక్షలు చెప్పారు. "ప్రేక్షకాదరణ పొందిన భగవంత్ కేసరి సినిమాకి జాతీయ అవార్డు రావడం సంతోషకరమైన విషయం.
హీరో బాలకృష్ణ, చిత్రబృందానికి శుభాకాంక్షలు"అని పేర్కొన్నారు. జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో తెలుగు సినిమా రంగానికి పలు పురస్కారాలు దక్కడం సంతోషంగా ఉందన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. "సోదరుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నటించిన 'భగవంత్ కేసరి' ఉత్తమ తెలుగు చిత్రం పురస్కారానికి ఎంపిక కావడం ఆనందదాయకం" అని పేర్కొన్నారు. ఇతర విజేతలకూ అభినందనలు తెలిపారు.
మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా భగవంత్ కేసరి చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. “71వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో బాలా మామయ్య హీరోగా నటించిన భగవంత్ కేసరి జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపిక కావడం చాలా సంతోషం.
మామయ్య నటన, సందేశాత్మక చిత్రంగా ప్రేక్షకుల మన్ననలు అందుకున్న ఈ సినిమాకి జాతీయ అవార్డు వచ్చిన సందర్భంగా మామయ్య, డైరెక్టర్ అనిల్ రావిపూడి, చిత్ర బృందానికి అభినందనలు” అని పోస్టు పెట్టారు.