ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీపై ఈడీ (Enforcement Directorate) లుకౌట్ నోటీసులు జారీ చేసింది. మనీ లాండరింగ్ కేసులో విచారణకు హాజరుకావాలన్న ఆదేశాలను ఉల్లంఘించి, ఆయన విదేశాలకు వెళ్లిపోతారని ఉన్న అనుమానాల నేపథ్యంలో ఈ చర్య తీసుకుంది. ఈ నెల ఆగస్టు 5న విచారణకు హాజరుకావాల్సి ఉండగా, ముందే దేశం విడిచిపెట్టి వెళ్లిపోవచ్చు అనే ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా ఈడీ అప్రమత్తమైంది.
ఇప్పటికే అనిల్ అంబానీపై రుణ మోసాలు, బ్యాంకుల మంగళం, మనీ లాండరింగ్ ఆరోపణలపై ఈడీ విచారణ చేపట్టింది. ఆయనకు సంబంధించి గతంలో కూడా ప్రశ్నలు సంధించగా, పలు కీలక అంశాలపై సమాధానాలు సరిపోనివిగా భావించిన అధికారులు, మరోసారి విచారణకు పిలిచారు. అయితే తాజా నోటీసులకు ఆయన స్పందించకపోవడంతో ఇప్పుడు ఎయిర్‌పోర్టుల వద్ద అడ్డుకోవడానికి లుకౌట్ నోటీసులు జారీ చేయాల్సి వచ్చింది.
లుకౌట్ నోటీసులు అంటే, విదేశాలకు వెళ్లే ప్రయత్నంలో ఉన్నప్పుడు సంబంధిత అధికారులకు అలర్ట్ అందించడంతో పాటు, ప్రయాణం నిలిపివేయడం జరుగుతుంది. దీంతో అనిల్ అంబానీ దేశం విడిచి వెళ్లేందుకు మార్గం సులభంగా ఉండదని తెలుస్తోంది.
ఇటీవలి కాలంలో అనేక పారిశ్రామికవేత్తలపై ఈడీ, సీబీఐ లు ఇలాంటి చర్యలు తీసుకుంటుండటం తెలిసిందే. ముఖ్యంగా, బ్యాంకు రుణాల్ని దుర్వినియోగం చేసిన కంపెనీలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు గట్టిగా వ్యవహరిస్తున్నాయి. అనిల్ అంబానీ కేసు కూడా అదే దిశగా సాగుతోంది.
ప్రస్తుతం ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చకు లోను కావడమే కాకుండా, ఆర్థిక నేరాలపై ప్రభుత్వ దృష్టిని చాటుతోంది. ఇక అనిల్ అంబానీ ఈ విచారణకు హాజరవుతారా? లేక మరోసారి చట్టాన్ని గాలికొదిలేస్తారా? అన్నది చూడాలి.