ఆకాశంలో అప్పుడప్పుడు కనబడే అద్భుతాలు మనసును కట్టిపడేస్తాయి. అందులో ఉల్కాపాతం, మెరుపులు ప్రధానమైనవి. ప్రత్యేకంగా ఉరుములతో కూడిన వర్షాలు పడినప్పుడు ఆకాశం నిండా మెరిసే పెద్ద పెద్ద మెరుపులు క్షణాల్లో అదృశ్యమైపోయినా, వెంటనే వచ్చే ఉరుము శబ్దం మనసు గుబులు గొలుపుతుంది. కానీ, ఈ మెరుపులకీ రికార్డులు ఉంటాయనేది చాలా మందికి తెలియని విషయం.
ప్రపంచంలోనే పొడవైన మెరుపు 829 కిలోమీటర్ల పొడవుతో నమోదైంది. ఇది అమెరికాలోని టెక్సాస్ (Texas) నుండి కన్సాస్ (Kansas) వరకు 2017 అక్టోబర్ 22న ఏర్పడింది. రెండో స్థానంలో నిలిచిన మరో భారీ మెరుపు 2020 ఏప్రిల్ 29న అమెరికా టెక్సాస్ నుంచి మిసిసిపీ వరకు విస్తరించింది.
దాని పొడవు 768 కిలోమీటర్లు. ఈ రికార్డులను ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) గుర్తించింది. అయితే మెరుపు పొడవు కొలిచే ప్రక్రియలో సుమారు 8 కిలోమీటర్ల వరకు తేడా ఉండవచ్చని సంస్థ పేర్కొంది.
సాధారణంగా ఇలాంటి విశాలమైన మెరుపులు భారీ తుపానుల సమయంలోనే ఏర్పడతాయి. ఈ మెరుపులు దూరంగా ఉన్న ప్రాంతాలను కూడా తాకుతుంటాయి. వీటినే ‘బోల్ట్ ఆఫ్ ది బ్లూ’ అని పిలుస్తారు. అయితే మెరుపులు అందంగా కనిపించినప్పటికీ, అవి అత్యంత ప్రమాదకరమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో మెరుపులు ఎక్కువ ప్రాణనష్టం కలిగిస్తున్నాయని డబ్ల్యూఎంవో వెల్లడించింది.
ప్రాణనష్టాన్ని తగ్గించేందుకు ప్రపంచ దేశాలు కలసికట్టుగా పనిచేస్తున్నాయి. అందులో భాగంగా, మెరుపు-పిడుగులపై ముందస్తు హెచ్చరికలు ఇవ్వగలిగే ఆధునాతన వాతావరణ హెచ్చరిక వ్యవస్థను రూపొందిస్తున్నారు. ఇది 2027 నాటికి ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి రానుందని డబ్ల్యూఎంవో ఆశాభావం వ్యక్తం చేసింది.
ఆకాశంలోని ఈ అద్భుతాలను చూసి ఆనందపడటమే కాకుండా, జాగ్రత్తలు తీసుకోవడం ప్రతి ఒక్కరి భద్రతకూ అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.