ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కుతున్న తరుణంలో మంత్రి పార్థసారథి (parthasarathi) ముఖ్యమైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాల వల్లే ప్రతిపక్ష నాయకుడు జగన్ మోహన్ రెడ్డికి అసహనం, నిరాశ కలుగుతోందని ఆయన పేర్కొన్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్ చేస్తున్న వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి, “ప్రజల్లో ప్రభుత్వానికి మంచి పేరు వస్తోంది. ఈ స్థితిలో జగన్ భావిస్తోన్న విషయం – 'ఇలా ముందుకు వెళ్తే మన పరిస్థితి ఏమైపోతుందో' అనే భయంతోనే ఆయన వ్యవహరిస్తున్నారు,” అని అన్నారు.
పార్థసారథి మాట్లాడుతూ, “పింఛన్ల కోసం మేము రూ. 40 వేల కోట్ల ఖర్చు చేశాం. తల్లి కి వందనం పథకానికి రూ. 10 వేల కోట్లు ఖర్చు పెట్టాం. ఆగస్టు 15 నుంచి మహిళలకు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి వస్తోంది. ఇటీవలి రైతుల ఖాతాల్లో రూ. 3200 కోట్లు జమ చేశాం. అంతేగాక, 16 వేల టీచర్ పోస్టులను భర్తీ చేశాం. ఇవన్నీ సంక్షేమమే కాకుండా ప్రజల జీవనోపాధిని మెరుగుపరిచే చర్యలుగా నిలుస్తున్నాయి,” అని వివరించారు.
ప్రభుత్వ సంక్షేమాన్ని చూసి ప్రతిపక్షం తప్పుడు ప్రచారానికి దిగుతుండటం బాధాకరమని మంత్రి విమర్శించారు. ముఖ్యంగా ప్రతిపక్ష నేత జగన్ రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడాల్సిన సమయంలో అసత్య ఆరోపణలు చేయడమే పనిచేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుత ప్రభుత్వం ప్రజల ప్రయోజనాల కోసం నిరంతరం శ్రమిస్తోందని, రాష్ట్రానికి మంచి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతుందని పార్థసారథి స్పష్టం చేశారు. ఎన్నికల వేళ ప్రభుత్వ పనితీరు ప్రతిపక్షాలకు ఎర్రసిగ్నల్‌గా మారుతుందనే భావనలోనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు.