తెలంగాణలో సంచలనంగా మారిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో జరిగిన భారీ అవకతవకాలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కీలక నివేదికను సమర్పించింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ అవకతవకాలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా పూర్తిగా బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. ప్రాజెక్టు ప్రణాళిక, నిర్మాణం, నిర్వహణ, ధరల సర్దుబాట్లు, కాంట్రాక్టు సవరణలు, ఆర్థిక హామీలు వంటి ప్రతి అంశంలోనూ కేసీఆర్ పాత్ర ఉందని కమిషన్ పేర్కొంది.
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో నాణ్యతా లోపాలు, డిజైన్ వైఫల్యాలపై విచారణ జరిపిన కమిషన్, మూడింటికీ సంబంధించి అధికారుల నుంచి వచ్చిన నివేదికల ఆధారంగా కేసీఆర్‌తో పాటు ఇతర రాజకీయ, అధికార ప్రముఖులపై కూడా ఆరోపణలు పేర్కొంది. నీటిపారుదల శాఖ మాజీ మంత్రి, ఐఏఎస్ అధికారులు, కేఐపీసీఎల్ బోర్డు సభ్యులు, చీఫ్ ఇంజనీర్లు–వీళ్లందరూ నిబంధనలు ఉల్లంఘించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని తేల్చింది. contractor ఎల్ అండ్ టీకు అవసరమైన అర్హతలే లేవని, ఏడో బ్లాక్ పునర్నిర్మాణాన్ని సొంత ఖర్చుతో చేయాలని కమిషన్ స్పష్టం చేసింది.