ఆంధ్రప్రదేశ్‌లో రైలు ప్రయాణికులకు కీలకమైన గమనిక. దక్షిణమధ్యరైల్వే పరిధిలో విజయవాడ మీదుగా నడిచే పలు రైళ్లు కొండపల్లి రైల్వే స్టేషన్‌లో తాత్కాలికంగా ఆగవని అధికారులు తెలిపారు. ప్రస్తుతం అక్కడ ఫుట్‌ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభమైన కారణంగా అక్టోబర్ 19 నుంచి నవంబర్ 18 వరకు రైళ్ల హాల్ట్‌ను ఎత్తివేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఈ క్రమంలో గుంటూరు–సికింద్రాబాద్ గోల్కొండ ఎక్స్‌ప్రెస్, తిరుపతి–ఆదిలాబాద్ కృష్ణా ఎక్స్‌ప్రెస్, మచిలీపట్నం–విజయవాడ–బీదర్ సూపర్‌ఫాస్ట్, విజయవాడ–భద్రాచలం, విజయవాడ–డోర్నకల్ మెము ప్యాసింజర్ రైళ్లు కొండపల్లి వద్ద ఆగవని స్పష్టంచేశారు. ప్రయాణికులు ఈ విషయాన్ని ముందుగానే గమనించాలని అధికారులు సూచించారు.
ఇక ఏపీ మీదుగా తిరుపతికి కొత్త రైళ్లు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. వారంలో ఆరు రైళ్లు తిరుమల భక్తుల సౌకర్యార్థం నడుస్తున్నాయి. కరీంనగర్–తిరుపతి ఎక్స్‌ప్రెస్ గురువారం, ఆదివారాల్లో నడుస్తుండగా, నాందేడ్–తిరుపతి ప్రత్యేక రైలు శనివారాల్లో, నాందేడ్–ధర్మవరం రైలు శుక్రవారాల్లో నడుస్తుంది. అదనంగా లాల్‌కౌన్ జంక్షన్–కేఎస్సార్ బెంగళూరు స్పెషల్ రైలు ఆదివారాల్లో, దన్‌బాద్–కోయంబత్తూరు స్పెషల్ ఎక్స్‌ప్రెస్ కూడా తిరుమల వెళ్లే భక్తులకు సౌకర్యవంతంగా అందుబాటులోకి వచ్చింది.
ఇక కాచిగూడ నుంచి బయలుదేరే రెండు మెము ప్యాసింజర్ రైళ్ల సమయాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. కాచిగూడ–మిర్యాలగూడ మెము రైలు ఇకపై రాత్రి 7.40 గంటలకు బయలుదేరుతుంది. కాచిగూడ–వాడి మెము రైలు మాత్రం 7.25 గంటలకే బయలుదేరనుంది. ఈ మార్పులు సోమవారం నుంచే అమల్లోకి వచ్చాయి. ఇకపై కాచిగూడ–మిర్యాలగూడ మెము రైలు 10 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరుతుందని రైల్వే అధికారులు తెలిపారు.