టెక్ దిగ్గజం యాపిల్ భారత్‌లో తన రిటైల్ విస్తరణకు వేగం పెంచింది. దేశంలో నాలుగో అధికారిక స్టోర్‌ను పూణేలోని కోరేగావ్ పార్క్‌లో సెప్టెంబర్ 4న ప్రారంభించనున్నట్లు మంగళవారం ప్రకటించింది. దీంతో పూణే వినియోగదారులు యాపిల్ ఉత్పత్తులను ప్రత్యక్షంగా చూసి కొనుగోలు చేయడమే కాకుండా, నిపుణుల నుంచి సహాయం పొందే అవకాశం కలుగుతుంది.
కేవలం రెండు రోజుల్లోనే భారత్‌లో యాపిల్ రెండు స్టోర్లను తెరవడం విశేషం. పూణే స్టోర్‌కు రెండు రోజుల ముందే, అంటే సెప్టెంబర్ 2న బెంగళూరు హెబ్బాల్‌లో కొత్త స్టోర్‌ను ప్రారంభించనుంది. ఈ రెండు స్టోర్ల బారికేడ్లను భారత జాతీయ పక్షి నెమలి ఈకల స్పూర్తితో చేసిన కళాకృతులతో అలంకరించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది.
కొత్త స్టోర్లలో కస్టమర్లు యాపిల్ తాజా ఉత్పత్తులను అనుభవించడంతో పాటు, స్పెషలిస్టులు, క్రియేటివ్‌లు, జీనియస్‌ల వంటి సిబ్బందితో సంప్రదించి పూర్తి సమాచారం పొందవచ్చు. అదనంగా, ఫొటోగ్రఫీ, మ్యూజిక్, కోడింగ్ వంటి విషయాలపై ‘టుడే ఎట్ యాపిల్’ పేరుతో ఉచిత వర్క్‌షాప్‌లు కూడా నిర్వహించనున్నారు.
రిటైల్ విస్తరణతో పాటు, భారత్‌లో తయారీని కూడా యాపిల్ ముమ్మరం చేస్తోంది. రాబోయే ఐఫోన్ 17 సిరీస్‌లోని అన్ని మోడళ్లను, ప్రో వెర్షన్‌లతో సహా, ప్రారంభం నుంచే భారత్‌లోనే అసెంబుల్ చేయాలని యాపిల్ ప్రణాళికలు రచిస్తోంది. ఇందుకోసం ఐదు స్థానిక ఫ్యాక్టరీలను సిద్ధం చేసినట్లు సమాచారం. భారత్‌లో అన్ని ఐఫోన్ మోడళ్లను ఒకేసారి ఉత్పత్తి చేయడం ఇదే తొలిసారి కానుంది.