ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ ఫోన్‌పే కొత్తగా గృహ బీమా పాలసీని ప్రారంభించింది. కేవలం రూ.181 వార్షిక ప్రీమియంతో ప్రతి ఒక్కరూ తమ ఇల్లు, ఇంట్లోని సామాను, విలువైన వస్తువులకు పూర్తి భద్రత పొందొచ్చు.
ఫోన్‌పే యాప్ ద్వారా ఎలాంటి పత్రాలు అవసరం లేకుండా, పూర్తిగా డిజిటల్ పద్ధతిలో, కొన్ని నిమిషాల్లోనే పాలసీ పొందవచ్చు.
ఈ బీమా కింద వినియోగదారులు రూ.10 లక్షల నుంచి గరిష్ఠంగా రూ.12.5 కోట్ల వరకు బీమా హామీ ఎంచుకోవచ్చు. ఇది కేవలం ఇంటి నిర్మాణానికే కాకుండా, ఫర్నిచర్, ఎలక్ట్రానిక్ పరికరాలు, విలువైన వస్తువులకు కూడా వర్తిస్తుంది.
అగ్ని ప్రమాదాలు, వరదలు, భూకంపాలు, అల్లర్లు, దొంగతనాలు వంటి 20కి పైగా ఊహించని నష్టాల నుంచి ఆర్థిక రక్షణ లభిస్తుంది.
ఫోన్‌పే ఇన్సూరెన్స్ సీఈఓ విశాల్ గుప్తా మాట్లాడుతూ–. “ప్రతి భారతీయుడికి తక్కువ ఖర్చుతో బీమా అందించడం మా లక్ష్యం. ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కల, ఈ ఆస్తిని రక్షించుకోవడానికి మా గృహ బీమా ఎంతో ఉపయోగపడుతుంది” అన్నారు.
సాధారణంగా గృహ రుణాలతో వచ్చే పాలసీలు ఖరీదైనవే. కానీ ఫోన్‌పే బీమా గృహ రుణం ఉన్నవారికి, లేనివారికీ అందుబాటులో ఉంటుంది. అన్ని బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు కూడా దీన్ని అంగీకరిస్తాయని కంపెనీ తెలిపింది.