ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకం అమల్లోకి రానుంది. ఈ పథకాన్ని మంగళగిరిలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రంలోని 11,449 బస్సుల్లో 8,458 బస్సులను ఈ పథకంలో భాగం చేశారు. ఉచిత ప్రయాణానికి అనుమతి ఉన్న బస్సుల జాబితా, గుర్తింపు కార్డుల వివరాలను ప్రభుత్వం వచ్చే రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటించనుంది. రద్దీ పెరిగే అవకాశం దృష్ట్యా ఆర్టీసీ అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
అయితే, కొన్ని ప్రత్యేక బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అవకాశం ఉండదు. రాష్ట్రం నుంచి కర్ణాటక, తమిళనాడు, తెలంగాణలకు వెళ్లే ఇంటర్‌స్టేట్ ఎక్స్‌ప్రెస్ బస్సులు, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు ఘాట్ రూట్ బస్సులు, నంద్యాల జిల్లాలోని శ్రీశైలం ఘాట్ రూట్ బస్సులు, అలాగే నాన్‌స్టాప్ ఎక్స్‌ప్రెస్ బస్సులు ఈ పథకం పరిధిలోకి రావు. రద్దీ మరియు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు.
పథకం ప్రారంభానికి ఇంకా ఐదు రోజులు మాత్రమే ఉండగా, డ్రైవర్లు మరియు కండక్టర్ల కొరత సమస్యను ఆర్టీసీ పరిష్కరించేందుకు చర్యలు చేపట్టింది. ప్రతి డిపోలో తాత్కాలిక డ్రైవర్ల నియామకాన్ని పెంచి, కొందరు కండక్టర్లకు డబుల్ డ్యూటీలు కేటాయించనున్నారు. ప్రస్తుతం ప్రయాణికుల్లో మహిళల శాతం 40 కాగా, ఈ పథకం అమలుతో అది 67 శాతానికి పెరిగే అవకాశం ఉంది. పురుషుల సంఖ్య తగ్గడం వల్ల ఆర్టీసీకి సంవత్సరానికి సుమారు రూ.288 కోట్ల నష్టం, మొత్తం ఉచిత ప్రయాణ పథకం వల్ల రూ.1,942 కోట్ల భారం పడనుందని అంచనా.