ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏజెన్సీ ప్రాంతం పట్ల తన అభిమానాన్ని వ్యక్తం చేస్తూ, “ఏజెన్సీ అంటే దేవుడు సృష్టించిన అద్భుతం. ఆహ్లాదకరమైన కొండలు మాత్రమే కాదు, మంచి మనసున్న ప్రజలతో నిండిన ప్రదేశం. హెలికాప్టర్లో వస్తూ ఆ కొండలు చూస్తుంటే, మరో జన్మ ఉంటే ఇక్కడే పుట్టి ఇక్కడే ఉండాలనిపించింది” అన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం వంజంగిలో జరిగిన ‘ప్రజావేదిక’లో మాట్లాడుతూ, అరకు కాఫీ బ్రాండ్‌ను తాను ప్రోత్సహించిన విషయాన్ని గుర్తుచేశారు. పాడేరు ఏజెన్సీలోని 11 మండలాల్లో 2.58 లక్షల ఎకరాల్లో సాగు అవుతున్న కాఫీపై 2.46 లక్షల మంది ఆధారపడి ఉన్నారని, సేంద్రియ వ్యవసాయానికి ధ్రువీకరణ తీసుకువచ్చి ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్‌లోకి తీసుకెళ్లే ప్రణాళిక ఉందన్నారు. కాఫీ, మిరియాలు, పండ్ల పంటలు, కుంకుమ వంటి పంటలను మెరుగ్గా సాగుచేస్తే ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్పారు.
గిరిజన ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, కాఫీ, తేనె, రాగి వంటి ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లోకి తీసుకెళ్లేందుకు ప్రైవేట్ భాగస్వామ్యంతో జీసీసీ ఒప్పందం కుదుర్చుకుందని తెలిపారు. దీంతో గిరిజనుల ఆదాయం మూడు రెట్లు పెరుగుతుందని, వెదురు ఆధారంగా 5 వేల మంది డ్వాక్రా మహిళలకు ఏటా లక్ష రూపాయల ఆదాయం వచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. గిరిజనులకు ఉద్యోగాలు కల్పించేందుకు తెదేపా హయాంలో తీసుకొచ్చిన జీఓ నం.3ను పునరుద్ధరించేందుకు లేదా దానికి సమానమైన ప్రత్యామ్నాయంపై నిపుణులతో చర్చిస్తున్నామని, త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
వైకాపా పాలనలో గిరిజనులపై జరిగిన అన్యాయాన్ని ప్రస్తావిస్తూ, “ఒకసారి మోసపోయాను, రెండోసారి మోసపోను” అన్నారు. ఏజెన్సీలో గంజాయి సాగును ప్రోత్సహించిన వారిని రాజకీయ ముసుగులో వదిలిపెట్టబోమని, ముసుగు తొలగించి వారిని తగిన స్థలంలో పెట్టే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. తన పాలనలో రాష్ట్రంలో ఎక్కడా గంజాయి పండించడం లేదని ధైర్యంగా చెప్పగలనని పేర్కొన్నారు. ప్రజావేదికలో గిరిజన ప్రాంతాల్లో చేపట్టనున్న అభివృద్ధి పథకాల శంకుస్థాపనలు చేసి, ఉత్పత్తుల స్టాళ్లను పరిశీలించారు.