ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నలుగురు అదనపు న్యాయమూర్తులు పూర్తి స్థాయి జడ్జిలుగా పదోన్నతి పొందారు. జస్టిస్ హరనాథ్ నూనెపల్లి, జస్టిస్ కిరణ్మయి, జస్టిస్ సుమతి, జస్టిస్ న్యాపతి విజయలకు పదోన్నతిని మంజూరు చేస్తూ కేంద్ర న్యాయశాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.
ఇటీవల సుప్రీం కోర్టు కొలీజియం దేశవ్యాప్తంగా వివిధ హైకోర్టులలో 16 మంది అదనపు న్యాయమూర్తులను శాశ్వత జడ్జిలుగా నియమించాలనే సిఫార్సు చేసింది. అందులో ఏపీ హైకోర్టుకు చెందిన ఈ నలుగురు న్యాయమూర్తులు కూడా ఉన్నారు.
రాష్ట్రపతి ఆమోదం తెలిపిన అనంతరం, కేంద్ర న్యాయశాఖ తాజా ఉత్తర్వులను విడుదల చేసింది. ఈ నియామకాలతో ఏపీ హైకోర్టు న్యాయవిధానంలో స్థిరత్వం, తీర్పుల వేగం పెరగనుందని న్యాయవర్గాలు భావిస్తున్నాయి.