మాలీవుడ్ సినిమా పరిశ్రమకు పెద్ద షాక్ తగిలింది. సూపర్ స్టార్ మమ్ముట్టి నుంచి పలువురు ప్రముఖ హీరోలు ఇబ్బందుల్లో పడుతున్నారు. చట్టానికి విరుద్ధంగా వ్యవహరించారనే ఆరోపణలతో వారు సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఒకేసారి వారి ఇళ్లు, ఆఫీసులపై దాడులు చేశారు. ఈ సంఘటనతో మొత్తం మలయాళ చిత్ర పరిశ్రమలో కలకలం రేగింది.
వీరు అక్రమంగా లగ్జరీ కార్లు కొనుగోలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. మమ్ముట్టి సొంత నిర్మాణ సంస్థ వే ఫేరర్ ఫిల్మ్స్ కార్యాలయాల్లో ఈడీ తనిఖీలు మొదటగా జరిగాయి. అదే సమయంలో చెన్నైలోని గ్రీన్‌వేస్ రోడ్‌లో ఉన్న మమ్ముట్టి ఇతర కార్యాలయాలపై కూడా అధికారులు సోదాలు చేశారు. ఈ ఆపరేషన్‌లో ఎనిమిది మంది ఈడీ అధికారులు, సీఆర్పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.
లగ్జరీ కార్లను అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ నకిలీ పత్రాలతో వాహన రిజిస్ట్రేషన్లు జరిగినట్లు ఈడీ గుర్తించింది. ఆ తర్వాత ఆ కార్లను తక్కువ ధరలకు మలయాళ సినీ ప్రముఖులకు, ఇతర ధనవంతులకు అమ్మినట్లు సమాచారం.
కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని 17 ప్రాంతాల్లో ఈడీ విస్తృత దాడులు కొనసాగిస్తోంది. లగ్జరీ వాహనాల అక్రమ రవాణా, విదేశీ డబ్బు లావాదేవీలకు సంబంధించి ఈ దర్యాప్తు జరుగుతోంది. సినీ నటులు, నిర్మాతలు, దర్శకులు ఉపయోగించే వాహనాలు, కేరళలోని పెద్ద ఆటో వర్క్‌షాపులు, వ్యాపార సంస్థలు కూడా ఈ విచారణలో ఉన్నాయి.
కేరళలోని కొచ్చి యూనిట్‌కు చెందిన ఈడీ అధికారులు ఈ ఆపరేషన్‌ను చేపట్టారు. హీరోలు దుల్కర్ సల్మాన్, మమ్ముట్టి ఇళ్లలో ఈడీ అధికారులు దాడులు నిర్వహించారు. అలాగే నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఈ సోదాలను ఎదుర్కొంటున్నారు. నటుడు అమిత్ చకలక్కల్ సహా మరికొంతమంది మలయాళ సినీ ప్రముఖుల ఇళ్లు, వ్యాపార సంస్థలు ఈడీ రాడార్‌లో ఉన్నాయి.
మొత్తానికి ఈ లగ్జరీ కార్ల కేసు మలయాళ సినీ పరిశ్రమకు పెద్ద తలనొప్పిగా మారింది. అన్ని ఆధారాలు సేకరించిన తర్వాత ఈడీ మరికొంతమంది సినీ ప్రముఖులకు పేర్లను మీడియాకి తెలిపే అవకాశం ఉందని సమాచారం.