సమాజ సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలనుకునే యువతకు కేంద్ర ప్రభుత్వం మంచి అవకాశం కల్పించింది. చిత్తూరు జిల్లాలోని మేరా యువ భారత్ (MY Bharat) కార్యాలయం వాలంటీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకాలు ద్వారా యువత సేవ చేస్తూనే నెలకు స్టైపెండ్ రూపంలో పారితోషికం పొందవచ్చు.
ఈ పోస్టులకు కనీస అర్హత పదో తరగతి ఉత్తీర్ణత సాధించాలి. అభ్యర్థుల వయస్సు 18 నుండి 29 సంవత్సరాల మధ్య ఉండాలి. సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. మొత్తం 20 వాలంటీర్ పోస్టులు ఉన్నాయి. ఆసక్తి గల యువత ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ అక్టోబర్ 15, 2025. ఎంపికైన వారికి నెలకు ₹5,000 వరకు స్టైపెండ్ అందుతుంది. వాలంటీర్‌షిప్ కాలం ఒక సంవత్సరం ఉంటుంది.
దరఖాస్తులు స్వీకరించిన తరువాత, చిత్తూరు మేరా యువ భారత్ కార్యాలయంలో ఇంటర్వ్యూ నిర్వహించబడుతుంది. మెరిట్, వ్యక్తిత్వం, సామాజిక అవగాహన వంటి అంశాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఎంపికైన వాలంటీర్లు తమ పరిధిలోని రెండు మండలాలు కలిపి బాధ్యతలు తీసుకుంటారు. యువజన, మహిళా సంఘాలతో కలిసి వారు ఆరోగ్యం, పచ్చదనం, పరిశుభ్రత, అక్షరాస్యత, మహిళా సాధికారత వంటి అంశాలపై ప్రజల్లో చైతన్యం కల్పించాల్సి ఉంటుంది. సమాజ అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం పెంచడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం.
ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా యువజన అధికారి ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ సమాజానికి సేవ చేయాలనే ఉత్సాహం ఉన్న యువతకు ఇది అద్భుతమైన వేదిక. ఈ కార్యక్రమం ద్వారా వారు సామాజిక బాధ్యత నేర్చుకుంటూనే ఆర్థిక ప్రోత్సాహం కూడా పొందగలరు.