ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు పెద్ద ఆర్థిక ప్రోత్సాహం ఇచ్చే కొత్త పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం ద్వారా మునగ (Drumstick) సాగును ప్రోత్సహిస్తూ, రైతులు ఈ పంటను ఆదాయ వనరుగా మార్చుకునే అవకాశం లభిస్తుంది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో తొలిగా 12 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించబడుతుంది. ఈ పథకంలో భాగంగా రైతులు ఎకరా విస్తీర్ణంలో రూ.1.49 లక్షల వరకు ఆర్థిక సహాయం పొందవచ్చు. ఇప్పటివరకు 2,177 మంది రైతులు 1,814 ఎకరాల్లో మునగ సాగుకు ముందుకు వచ్చారు.
మునగ విత్తనాల నాణ్యతను పెరియకులం (తమిళనాడు) ఉద్యాన విశ్వవిద్యాలయం సిఫార్సు చేసిన PKM రకం ద్వారా నిర్ధారించారు. ప్రతి ఎకరానికి సుమారు 4,000 విత్తనాలు అవసరం, వీటిని రైతులు స్వయంగా కొనుగోలు చేస్తారు. విత్తన ధర కిలో రూ.3,500గా ఉంది. రైతులు 25 సెంట్ల నుంచి ఒక ఎకరం వరకు విస్తీర్ణంలో మునగ సాగు చేయవచ్చు. రైతులకు ఏకకాలంలో ఐదేళ్లపాటు సుస్థిర దిగుబడి లభించేలా పథకం రూపకల్పన చేయబడింది.
ఉపాధి హామీ పథకం కింద, రైతులు గుంతలు తీయడం, విత్తనాలు నాటడం, నీటిపరిరక్షణ, మొక్కల పర్యవేక్షణ వంటి కార్యకలాపాలకు ఆర్థిక సహాయం పొందుతారు. నాలుగు నెలల్లో కోతకు వచ్చే మునగ ఆకు పంట ద్వారా ఏకరానికి ఏడాదికి రూ.4.50 లక్షల వరకు ఆదాయం లభిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ పథకం ద్వారా రైతులు తమ భూమి పరిమాణానికి అనుగుణంగా ప్రోత్సాహకాలు పొందుతారు.
డ్వాక్రా మహిళలు మునగ సాగును కుటుంబ యూనిట్లుగా చేపడతారు. ప్రాసెసింగ్ ప్లాంట్ల ఏర్పాటు కోసం అవసరమైన రుణాలు రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ మొత్తం వరకు అందించబడతాయి. పంట సేకరణ సమయంలో రైతులు తమ ఉత్పత్తిని సులభంగా అమ్మేందుకు ప్రభుత్వం ప్రైవేటు సంస్థలతో ఒప్పందాలు కుదురుస్తుంది. ఇప్పటికే కొన్ని ప్రైవేటు సంస్థలు కొనుగోలు కోసం ముందుకు వచ్చాయి.
పైలట్ ప్రాజెక్ట్ ప్రస్తుతం శ్రీకాకుళం, అనకాపల్లి, గుంటూరు, పల్నాడు, బాపట్ల, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, అనంతపురం, నంద్యాల, శ్రీసత్యసాయి జిల్లాల్లో అమలు అవుతోంది. రైతులు నాటిన విస్తీర్ణం ప్రకారం 25 సెంట్లలో రూ.38,125, 50 సెంట్లలో రూ.75,148, 75 సెంట్లలో రూ.1.25 లక్షలు, ఎకరాలో రూ.1.49 లక్షల వరకు రెండు సంవత్సరాల్లో ఆర్థిక సహాయం పొందతారు. రైతులు తమ భూమి పాస్‌బుక్, 1B, ఉపాధి హామీ జాబ్ కార్డు జిరాక్స్ కాపీలను సంబంధిత అధికారులు వద్ద సమర్పించాలి.