ఉన్నత విద్యలో ప్రొఫెసర్‌గా కెరీర్ కొనసాగించాలని ఆశపడుతున్న అభ్యర్థులకు శుభవార్త. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (UGC NET) డిసెంబర్–2025 సెషన్‌కు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఈ మేరకు అధికారిక ప్రకటన చేస్తూ, రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. అసిస్టెంట్ ప్రొఫెసర్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF), అలాగే పీహెచ్‌డీ అడ్మిషన్ల కోసం అర్హత సాధించాలని కోరుకునే అభ్యర్థులు ugcnet.nta.nic.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
యూజీసీ నెట్ పరీక్షలు డిసెంబర్ సెషన్‌లో కూడా పూర్తిగా ఆన్‌లైన్ (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) విధానంలోనే నిర్వహించనున్నారు. ఈసారి మొత్తం 85 సబ్జెక్టుల్లో పరీక్షలు జరుగుతాయి. అభ్యర్థులు నవంబర్ 7, 2025 రాత్రి 11.50 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు జనరల్ కేటగిరీకి రూ.1150, ఓబీసీ-ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు రూ.600, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, పీడబ్ల్యూబీడీ, థర్డ్ జెండర్ అభ్యర్థులకు రూ.325గా నిర్ణయించారు. ఫీజు చెల్లింపు కూడా అదే తేదీ, సమయానికి ముగుస్తుంది.
ఎన్టీఏ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం పరీక్షలు డిసెంబర్‌లో నిర్వహించనున్నారు. అభ్యర్థులు దరఖాస్తు సమర్పించిన తర్వాత నవంబర్ 10 నుంచి 12 వరకు అప్లికేషన్‌లో అవసరమైన సవరణలు చేసుకునే అవకాశం ఉంటుంది. పరీక్ష నగరం, అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ లింకులు, ఖచ్చితమైన పరీక్ష తేదీలను కూడా అధికారిక వెబ్‌సైట్‌లో తదుపరి దశలో ప్రకటించనున్నారు. ప్రతి సబ్జెక్టుకు పేపర్-1, పేపర్-2 రూపంలో పరీక్షలు ఉంటాయి. ఈ రెండు పేపర్లలో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులు అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత లేదా జేఆర్ఎఫ్ అర్హత పొందుతారు.
ఈ పరీక్ష దేశవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులకు ఉన్నత విద్యా, పరిశోధన రంగాల్లో అవకాశాలను అందించే ప్రధాన ద్వారంగా పరిగణించబడుతుంది. యూజీసీ నెట్ అర్హత సాధించడం ద్వారా విశ్వవిద్యాలయాలు, డిగ్రీ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నియామకానికి అర్హత లభిస్తుంది. అదనంగా, జేఆర్ఎఫ్ అర్హత పొందినవారికి కేంద్ర, రాష్ట్ర పరిశోధనా సంస్థల్లో ఫెలోషిప్ అవకాశాలు ఉంటాయి. అందువల్ల ఈ పరీక్షకు వేల సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటారు. అధికారిక వెబ్‌సైట్‌లో విడుదలైన నోటిఫికేషన్‌లో సబ్జెక్ట్ కోడ్‌లు, సిలబస్, అర్హత ప్రమాణాలు, పరీక్షా కేంద్రాల వివరాలు, టైమ్‌టేబుల్ వంటి అన్ని వివరాలు అందుబాటులో ఉన్నాయి.