2025లో యూరప్‌కి వెళ్లాలనుకునే భారతీయులు వీసా సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, స్విట్జర్లాండ్ వంటి దేశాలు స్కెంజెన్ వీసాలను ఎక్కువగా తిరస్కరిస్తుండటంతో ప్రయాణికులు విమాన టికెట్లు, హోటల్ బుకింగ్‌లు, బీమా డబ్బులను కోల్పోతున్నారు.
ఈ తిరస్కరణల వల్ల భారతీయులు ఇప్పటి వరకు రూ.136 కోట్లకు పైగా నష్టపోయారు. 2024లో 1.65 లక్షల కంటే ఎక్కువ భారతీయ వీసా దరఖాస్తులు తిరస్కరించబడ్డాయి. వీసా తిరస్కరణల ప్రధాన కారణాలుగా అసంపూర్ణమైన పత్రాలు, స్పష్టత లేని ప్రయాణ ప్రణాళికలు, కఠినమైన పరిశీలన విధానాలను కన్సులేట్లు పేర్కొంటున్నాయి.
ఫ్రాన్స్ ఒక్కటే 31,000కి పైగా దరఖాస్తులను తిరస్కరించి దాదాపు రూ.25 కోట్ల నష్టం కలిగించింది. స్విట్జర్లాండ్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్ వంటి ఇతర దేశాలు కూడా వేలాదిగా దరఖాస్తులను తిరస్కరించాయి.
వీటితో పాటు జూలై 2025లో జర్మనీ తన "రిపోర్టింగ్ ప్రక్రియ"ను రద్దు చేసింది. దీని కారణంగా ఇప్పుడు వీసా తిరస్కరణలపై ఫిర్యాదు చేసేందుకు భారతీయులు చట్టపరమైన మార్గమే ఆశ్రయించాల్సి వస్తోంది. ఇది ఖరీదైన మరియు సమయం పట్టే ప్రక్రియ కావడంతో చాలా మందికి సమస్యగా మారింది.
మరోవైపు, కొన్ని యూరోపియన్ కాన్సులేట్‌లలో వీసా అపాయింట్‌మెంట్ కోసం రెండు నెలల వరకు ఆలస్యం జరుగుతోంది. వేసవి కాలంలో ఇది మరింత గందరగోళానికి దారితీస్తోంది.
ఈ పరిస్థితులు పర్యాటకులతో పాటు విద్యార్థులు, ఉద్యోగార్థులు, చిన్న వ్యాపారవేత్తలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. జర్మనీలో చదవాలనుకునే విద్యార్థుల కలలు కూడా ఇలాంటి అడ్డంకుల వల్ల నెరవేరడం కష్టంగా మారింది.
నిపుణులు సూచిస్తున్న విషయాలు కూడా గమనించవచ్చు. దరఖాస్తుదారులు ముందుగానే వీసాకు అప్లై చేయాలి, పత్రాలను పూర్తిగా సిద్ధం చేసుకోవాలి, ఆలస్యాలు, తిరస్కరణలకు మానసికంగా సిద్ధంగా ఉండాలి. అంతేకాకుండా, యూరప్‌కి బదులుగా ఇతర ప్రత్యామ్నాయ దేశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని సలహా ఇస్తున్నారు.